కురుమూర్తి స్వామి ఉత్సవానికి పోలీస్ బందోబస్తు

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: కురుమూర్తి స్వామి (Kurumurthy Swamy )బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించనున్న అత్యంత ముఖ్యమైన ఘట్టమైన ఉద్దాల ఉత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బందోబస్తు విధుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకి, కురుమూర్తి ఆలయ ప్రాంగణంలోని పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించి విధులపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్దాల ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులను పూర్తి అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్రాఫిక్ నియంత్రణ.. పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి

భక్తుల రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని, వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలను నిలిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీని నియంత్రిస్తూ భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

దొంగతనాల నివారణకు చర్యలు

జాతరలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకొని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రత్యేక మఫ్టీ పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, పిక్‌పాకెటింగ్, చైన్ స్నాచింగ్ తదితర నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ

జాతర ప్రాంగణం, భక్తుల రాకపోకల మార్గాలు, ప్రధాన కూడళ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి సీసీ కెమెరాల ద్వారా జాతర పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టామన్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేయాలని, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. అదేవిధంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి భక్తులకు సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ ఉద్దాల ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఎస్పీ ఆదేశించారు.

697 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబ‌స్తు

కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు నిమిత్తం మొత్తం 697 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, బాలాజీ, భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, సీసీ కుంట ఎస్ఐ గోకారి, ఇతర సబ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీస్ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవానికి విచ్చేసే భక్తులందరూ పోలీస్ శాఖకు సహకరించి, పోలీస్ సిబ్బంది సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని ఎస్సీ విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>