epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వివాదాస్పదంగా కోమటిరెడ్డి వర్గం తీరు.. డీసీసీ చీఫ్‌కు అడుగడుగునా అవమానాలు!

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో (Nalgonda Congress) అంతర్గత కుమ్ములాటలు ముదిరి పాకాన పడ్డాయి. డీసీసీ అధ్యక్షుడుని సాధారణ కార్యకర్తలు కూడా కేర్ చేయడం లేదట. యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీరు ఒకటైతే.. ఒక్క నల్లగొండ జిల్లాలో మాత్రం మరో తీరు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాఖాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన పున్న కైలాష్ నేతను పార్టీ అధిష్టానం నియమించింది. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ఎంతపెద్ద నేతైనా శిరసావహించాల్సిందే. కానీ నల్లగొండ జిల్లాలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మారింది. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్‌ను మంత్రి కోమటిరెడ్డి వర్గీయులు కనీసం సాధారణ కార్యకర్తను గుర్తించకపోవడం కొసమెరుపు. సుదీర్ఘకాలం తర్వాత నల్లగొండ జిల్లాకు ఓ బీసీ నేత డీసీసీ అధ్యక్షుడయ్యారు. కానీ ఆ బీసీ నేతకు మాత్రం కనీస గౌరవం దక్కడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అడుగడుగునా అవమానాలే..

నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ (Nalgonda Congress) పార్టీలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులంతా ఏకపక్షంగా కైలాష్ నేతను పక్కన పెడుతున్నారట. ఏ పార్టీ ప్రోగ్రామ్‌లోనూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలోనూ కైలాష్‌ను పిలవడం లేదు. పైగా సపరేటుగా పార్టీ కార్యక్రమాలు, చైతన్య ర్యాలీలు తీస్తూ ఎక్కడా కైలాష్‌ను ఆహ్వానించకుండా అవమానిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫ్లెక్సీలో నో ఫొటో

ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు, యువ చైతన్య ర్యాలీ తదితర కార్యక్రమాలను మంత్రి కోమటిరెడ్డి వర్గీయులు ఘనంగా నిర్వహించారు. నల్లగొండ పట్టణమంతా ఎక్కడికక్కడ భారీ ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.  కానీ నల్లగొండ పట్టణంలో ఎక్కడా చిన్న సైజులోనూ పున్న కైలాష్ ఫొటో కన్పించకపోవడం కొసమెరుపు. కోమటిరెడ్డి అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం పున్న కైలాష్‌కు అవకాశం కల్పించింది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యి టీపీసీసీ చీఫ్‌కు లేఖ రాశారు.

ఆ తర్వాత వివాదం సద్దుమణిగినట్టు కన్పించినా.. అంతర్గతంగా మాత్రం తారస్థాయిలో కన్పిస్తోంది. అందులో భాగంగానే డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్‌కు మంత్రి కోమటిరెడ్డి వర్గీయులెవ్వరూ సహకరించకపోనూ అడుగడుగునా అవమానిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల చండూరు మండలంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలోనూ మంత్రి కోమటిరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇతర చోటామోటా లీడర్లు వేదికపైకి వెళ్లారు. కానీ డీసీసీ అధ్యక్షుడిని మాత్రం వేదికపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది.

పట్టించుకోని పార్టీ అధిష్టానం..

చండూరు వ్యవహారంలో మంత్రి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కండ్ల ఎదుట సంఘటన జరిగినా.. వారు స్పందించలేదు. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత బహిరంగంగానే పోలీసులతో వాగ్వాదానికి దిగినా.. ఈ ఘటనను ఖండించినా.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్కరూ స్పందించకపోవడం కొసమెరుపు. జిల్లాలోని ఒక్క ఎమ్మెల్యే గానీ.. ఒక్క సీనియర్ లీడర్ గానీ నోరుమెదపకపోవడం కొసమెరుపు. జిల్లాలో ఇంత జరుగుతున్నా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఓ బీసీ నేత, డీసీసీ అధ్యక్షుడికి సొంత పార్టీలోనే ఇంత అవమానం జరుగుతున్నా.. టీపీసీసీ చీఫ్ స్పందించకపోవడంపై కాంగ్రెస్ క్షేత్రస్థాయి క్యాడర్ సైతం ఆందోళన చెందుతోంది.

సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరు సొంత పార్టీ నేతల పట్ల ఇలా ఉంటే.. ఇంకా ప్రజల విషయంలో ఎంత వ్యతిరేకతను మూటగట్టుకుంటుందోననే ఆందోళన లేకపోలేదు. మరీ నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ వ్యవహారాన్ని చూసీచూడనట్టు వదిలేస్తారా..? లేకుంటే చర్యలకు దిగే సహాసం చేస్తారా..? అన్నది వేచిచూడాల్సిందే.

 Read Also: ఆ కారణంతో విడాకులు ఇవ్వలేం: తెలంగాణ హైకోర్టు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>