epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆ కారణంతో విడాకులు ఇవ్వలేం: తెలంగాణ హైకోర్టు

కలం, వెబ్ డెస్క్: విడాకులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana HC) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల భార్యభర్తల విడాకులకు సంబంధించిన కేసులు బాగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లైన  ఏడాదికో, రెండేండ్లకో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడాకులకు సంబంధించిన ఓ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. తన భార్య ఇంట్లో వంట చేయడం లేదని .. అందుకే తనకు విడాకులు కావాలంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే భార్య వంట చేయలేదన్న కారణంతో విడాకులు కోరడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగులయిన సందర్భంలో ఇంటి పనుల అంశాన్ని ఆధారంగా తీసుకుని విడాకులు కోరడం చట్టపరంగా సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది.

భార్య వేధిస్తోందంటూ పిటిషన్

ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి, తన భార్య తనపై మానసిక హింసకు పాల్పడుతోందని పేర్కొంటూ విడాకులు మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య వంట చేయకపోవడం, తరచూ పుట్టింట్లోనే ఉండడం, తనను పట్టించుకోకపోవడం వల్ల తాను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నానని పిటిషన్‌లో భర్త వాదించాడు. ఈ పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, ఇరు పక్షాల వాదనలు సుదీర్ఘంగా పరిశీలించారు. విచారణలో భర్త మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ఉద్యోగం చేస్తుండగా, భార్య ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నట్టు కోర్టు దృష్టికి వచ్చింది.

ఈ పరిస్థితుల్లో భార్య వంట చేయలేదన్న కారణంతో విడాకులు (Divorce) కోరడం సముచితమని చెప్పలేమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. భార్య వేరు కాపురం పెట్టాలని బలవంతంగా కోరితే అది క్రూరత్వంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. అయితే ప్రస్తుత కేసులో భార్య వేరు కాపురం కోసం ఎలాంటి ఒత్తిడి చేయలేదని, అలాంటి డిమాండ్ కూడా లేదని భార్య తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

భార్య వేధిస్తుంది అనడానికి ఆధారాలు లేవు

అలాగే, భార్య తనతో కన్నా పుట్టింట్లోనే ఎక్కువ సమయం గడుపుతోందన్న భర్త ఆరోపణలపై కూడా హైకోర్టు స్పందించింది. పెళ్లి అనంతరం భార్య గర్భం దాల్చిన సమయంలో తల్లిదండ్రుల వద్ద ఉండడం సహజమైన విషయమని, దానిని క్రూరత్వంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. భార్య ప్రవర్తనలో ఉద్దేశపూర్వకంగా భర్తను వేధించే చర్యలు లేదా మానసిక హింసకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవని కోర్టు అభిప్రాయపడింది.

కేవలం ఇంటి పనులు నిర్వహణ అంశాల ఆధారంగా వివాహ బంధాన్ని తెంచేంత తీవ్రమైన పరిస్థితి లేదని తేల్చింది. ఈ నేపథ్యంలో భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు పూర్తిగా తిరస్కరించింది. ఈ తీర్పు ద్వారా ఉద్యోగాలు చేస్తున్న దంపతుల మధ్య గృహబాధ్యతలను క్రూరత్వంగా మలచి విడాకులకు కారణంగా చూపడం సరికాదన్న అంశాన్ని హైకోర్టు (Telangana HC) స్పష్టంగా చెప్పినట్టయ్యిందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 Read Also: వివాదాస్పదంగా కోమటిరెడ్డి వర్గం తీరు.. డీసీసీ చీఫ్‌కు అడుగడుగునా అవమానాలు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>