కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అడవి జీవనం నుంచి ఆధునికత వైపు చెంచులను తరలించేందుకు (Chenchu Rehabilitation) రంగం సిద్ధమైంది. నల్లమల టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని ఆదివాసీ చెంచుల గిరిజనులను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు చివరి దశకు చేరాయి. ఆయా కుటుంబాలకు పునరావాస కల్పనలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద మోడల్ కాలనీ నిర్మిస్తారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పులులు, ఇతర వన్యప్రాణుల ఆవాసాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, కోర్ ఏరియాను మానవ సంచార రహిత ప్రాంతంగా మార్చే ప్రాజెక్ట్ లక్ష్యంలో భాగంగా తరలింపు ప్రయత్నాలను అధికారులు చేపట్టారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్ టీసీఏ) మార్గదర్శకాల మేరకు స్వచ్ఛందంగా అడవిని వీడి బయటకు రావడానికి ఒప్పుకునే కుటుంబాలకు ప్రత్యేక పునరావాస ప్యాకేజీని కల్పిస్తుంది. దట్టమైన అడవిలో సరైన వైద్యం, విద్య, రవాణా, మంచినీటి సౌకర్యాలు లేక ఇబ్బందులతో జీవించే చెంచులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన సురక్షిత నివాసాలను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వెయ్యికి పైగా కుటుంబాలకు వసతి
నల్లమల అడవిలో దశాబ్దాలుగా జీవనం సాగించే 1088 చెంచు గిరిజన కుటుంబాలకు పునరావాస ప్యాకేజీతో లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కింద సార్లపల్లి, కుడిచింతల బయలు, తాటి గుండాల, కొల్లంపెంటకు చెందిన 417 కుటుంబాలు స్వచ్ఛందంగా పునరావాసానికి ఒప్పుకున్నాయి. ఇందులో 15 లక్షల ప్యాకేజీలో 160 కుటుంబాలు ఎంవోయూపై సంతకాలు చేశాయి.
వారికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెక్కులను అందించారు. మిగతా 257 కుటుంబాలకు 5 ఎకరాల భూమి, 250 గజాల ఇంటి జాగాను పెద్ద కొత్తపల్లి మండలం బాచారంలో కేటాయించారు. వీరికి ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. రెండో విడతలో వటవర్లపల్లికి చెందిన 671 కుటుంబాలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో మొదటి ఆప్షన్ కింద 311 కుటుంబాలు ఒప్పుకోగా, రెండో ఆప్షన్ కింద 360 కుటుంబాలు ఎంఓయూపై సంతకాలు చేశాయి. ఇంకా నల్లమల్ల అడవిలో 10 – 20 శాతం వరకు కుటుంబాలు ప్రభుత్వ ప్యాకేజీలను తిరస్కరించాయి.
ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు
బాచారం వద్ద పునరావాసం పొందే ఒక్కో కుటుంబానికి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించి, ఆధునిక వసతులతో కూడిన ఇళ్లు నిర్మిస్తున్నారు. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిస్టంతో పాటు సీసీ రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులను అధికారులు ముమ్మరంగా కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ లో నిర్మించినట్టు కాకుండా మొదటగా రోడ్లు, మౌలిక వసతులను ఏర్పాటు చేసిన తర్వాతే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది.
అందుకు అనుగుణంగానే బాచారంలో ముందుగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. పునరావాస ప్యాకేజీ కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 8 లక్షలు ఖర్చు చేయనుంది. ఇటీవల పునరావాస గ్రామాల్లో ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో ఇళ్లు నిర్మించకుండా పునరావాస కల్పించే బాచారంలోనే ఇళ్లను నాణ్యతతో నిర్మించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు.
ఆర్థిక, భూమి ప్యాకేజీ
పునరావాస నిబంధనల మేరకు.. లబ్ధిదారులకు రూ. 15 లక్షల నగదు ప్యాకేజీని తొలి ఆప్షన్ కింద అందిస్తారు. రెండో ఆప్షన్ కింద వ్యవసాయ భూమి 5 ఎకరాలు, ఇంటి నిర్మాణ సాయం వంటివి అధికార యంత్రాంగం సమకూర్చుతుంది. 257 కుటుంబాలు వ్యవసాయం చేసుకోవడానికి గ్రామ సమీపంలోని అడవిని చదును చేసి సర్వే పనులు పూర్తి చేశారు. ఇందుకు 3,750 ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్ధం చేసింది.
ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి హద్దులను గుర్తించారు. పునరావాస ప్యాకేజీ చెంచుల జీవితంలో ఒక చారిత్రాత్మక ఘట్టమే అవుతుంది. అడవిలో ఉన్నప్పుడు అత్యవసర వైద్యం అందక, పిల్లల చదువులకు దూరమైన చెంచు కుటుంబాలు, బాచారం వంటి జనారణ్య ప్రాంతాలకు రావడంతో పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోగలుగుతారు.
ఎదురవుతున్న సవాళ్లు
మరోవైపు తరతరాలుగా తేనె సేకరణ, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి బతికిన చెంచులకు, బయటి ప్రపంచంలో వ్యవసాయం చేయడం, ఇతర ఉపాధి మార్గాలకు అలవాటు పడటం ఒక పెద్ద సవాలుగా మారింది. అడవితో తమ ఆత్మీయను వదులుకోవడం, షెడ్యూల్డ్ ప్రాంతం నుంచి బయటకు రావడంతో తమ హక్కులుకోల్పోతామేమోననే ఆందోళన కూడా కొందరిలో వ్యక్తమవుతోంది.
బాచారం వద్ద నిర్మించే మోడల్ కాలనీలో ఇటుకలు, సిమెంటుతో కట్టిన కట్టడాలు మాత్రమే కాకుండా ఆదివాసీల జీవనశైలిలోని పెను మార్పుకు సంకేతాలుగా భావించవచ్చు. ప్రభుత్వం ఇళ్లు నిర్మించి వదిలేయకుండా వారికి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించి, వ్యవసాయ పరికరాలు అందించి, నైపుణ్య శిక్షణ ఇస్తేనే అరణ్యం నుంచి జనారణ్యంలోకి వచ్చి జీవించే ప్రయాణం విజయవంతమవుతుంది.
చెంచుల తరలింపులో బాధ్యతగా ఉండాలి: రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్
వటువర్లపల్లి ప్రజల తరలింపులో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ సూచించారు. గ్రామ ప్రజలను కలిసి రీ లోకేషన్‌తో పాటు గ్రామాభివృద్ధిపై చర్చించారు. అడవినే నమ్ముకున్న గిరిజన చెంచులకు పీసా చట్టం – 1996, అడవి భూములపై పూర్తి హక్కుల చట్టం – 1/70 చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం – 2006 కూడా గిరిజనుల చెంచులకు ఉందని గుర్తు చేశారు. గ్రామంలో జీవించి ఉండాలనుకునే వారికి పూర్తిస్థాయిలో అభివృద్ధి వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

