కలం, ఖమ్మం బ్యూరో: వచ్చే డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి చేతులమీదుగా వెలుగుమట్ల ఇందిరమ్మ ఇళ్ల కాలనీ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో, అప్పటికల్లా నిర్మాణాలన్నీ పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్ వెలుగుమట్లలో (Velugumatla) నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన పురోగతిని సమీక్షించిన మంత్రి అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వేగవంతం చేయాలని, నిర్దేశిత గడువులోగా ఏ ఒక్క పని కూడా మిగిలి ఉండకూడదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి రావాల్సిన బిల్లులన్నింటినీ ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వెలుగుమట్ల ఇందిరమ్మ కాలనీని అన్ని హంగులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలని మంత్రి ఆకాంక్షించారు. కాలనీలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, అలాగే కాలనీ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

