నల్లగొండ ఎంజీయూ వేదికగా అరుదైన చరిత్ర సమ్మేళనం!

కలం, నల్లగొండ : దక్షిణ భారతదేశ సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక చరిత్రపై నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) వేదికగా లోతైన మేధోమథనం సాగుతోంది. వర్సిటీలో జరుగుతున్న 45వ దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ (South Indian History Congress ) మూడు రోజుల సదస్సులో భాగంగా రెండో రోజైన శనివారం ఏడు వేర్వేరు ప్యానెళ్లలో విస్తృత చర్చలు జరిగాయి.చరిత్ర రచనా విధానాలు, అణగారిన వర్గాల చరిత్ర తదితర కీలక అంశాలపై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరిశోధకులు తమ పరిశోధన ఫలితాలను వివరించారు.

ఈ సదస్సుకు మొత్తం 1,022 మంది ప్రతినిధులు నమోదు చేసుకోగా, అందులో 830 మంది పరిశోధన పత్రాల సమర్పణకు పేర్లు నమోదు చేసుకున్నారని నిర్వాహకులు ఆచార్య విజయబాబు తెలిపారు. రెండో రోజు ముగిసే నాటికి 650 పరిశోధన పత్రాల సమర్పణ పూర్తయిందని వెల్లడించారు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో పరిశోధకులు హాజరయ్యారని, ఇందులో మహిళా పరిశోధకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. మహిళా పరిశోధకులు ఎంచుకున్న అంశాల్లో సామాజిక సున్నితత్వం, లోతైన పరిశీలన ప్రతిబింబించాయని అభినందించారు. సదస్సులో సమర్పించిన ఈ విలువైన పరిశోధన పత్రాలన్నింటినీ అనంతరం గ్రంథరూపంలో ప్రచురించనున్నట్లు స్థానిక కార్యదర్శి డాక్టర్ పనస రామకృష్ణ వెల్లడించారు.

సదస్సులో భాగంగా నిర్వహించిన ప్రత్యేక స్మారక ఉపన్యాసాలు పరిశోధకులను ఆకట్టుకున్నాయి. ఆధునిక దక్షిణ భారత నిర్మాణంలో జస్టిస్ పార్టీ పాత్రపై ఆచార్య శ్రీనాథ్ విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. ఆచార్య బి.సి. రే స్మారక ఉపన్యాసాన్ని డాక్టర్ కె. రాజన్, ఆచార్య షేక్ మస్తాన్ స్మారక ఉపన్యాసాన్ని ఆచార్య ఎర్రన్న పత్తర్, ఆచార్య ఆర్.సి. మిశ్రో, డాక్టర్ కవిత మిశ్రా స్మారక ఉపన్యాసాన్ని హెచ్. మునవ అర్జన్ అందించారు. ప్రాచీన, మధ్యయుగాల్లో విశ్వకర్మల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, తమిళనాడు ఉన్నత విద్యారంగంలో ముస్లింల పాత్ర తదితర అంశాలపై ఈ ఉపన్యాసాల్లో లోతుగా చర్చించారు. కార్యక్రమంలో ఆచార్య విక్టర్ బాబు, కార్యదర్శి ఆచార్య సదాశివన్, ఆచార్య మస్తాన్‌వలి, కళాశాల ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ డాక్టర్ అరుణప్రియ, డాక్టర్ షరీఫ్, డాక్టర్ శ్రీనివాస్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>