ముగిసిన ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ శాసనమండలి (Legislative Council)లో ఒకే రోజు ముగ్గురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేశారు. గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో వారిని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో నియమితులై.. విశేషంగా సేవలు అందించారని ప్రశంసించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు తమ తమ రంగాల్లో ఎంతో అనుభవం ఉన్నవారని వివరించారు. గోరటి వెంకన్న ప్రజా గాయకుడిగా తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తన్నారు. తన పాటల్లో సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ ఎంతో చైతన్యం రగిలించారని కొనియాడారు.

ప్రజా సేవకు విరమణ లేదు..

బస్వరాజు సారయ్య కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఎమ్మెల్యే, మంత్రి, ఎమ్మెల్సీగా ప్రజా సేవ చేశారని ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసని బొగ్గారపు దయానంద్ మండలి చర్చల్లో తన పరిపాలనా అనుభవాన్ని ఉపయోగించి, వివిధ అంశాలపై మాట్లాడారని గుర్తు చేశారు. పదవికి మాత్రమే విరమణ చేశారని, ప్రజా సేవకు కాదనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. తమ అనుభవాన్ని సమాజానికి ఉపయోగిస్తూ ఉండాలన్నారు.

ఒకేరోజు ముగ్గురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయడం ఛైర్మన్‌గా తనకు కొంత భావోద్వేగాన్ని కలిగించే అంశమని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా స్నేహపూర్వక వాతావరణం కొనసాగిస్తుండాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే, గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురిని కొత్త ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాల్సి ఉంటుంది. అవకాశం ఎవరికీ వస్తుందోనన్న చర్చ పార్టీ వర్గాల్లో బలంగా జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>