కలం, వెబ్‌డెస్క్: శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, తపాలా శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి అయ్యప్ప ప్రసాదాన్ని (Ayyappa Prasadam) భక్తుల ఇంటికే పంపించనున్నట్లు తెలిపింది. ఇండియా పోస్ట్ ద్వారా ప్రసాదాన్ని సులభంగా కోరుకున్న వారి ఇంటికి చేరవేస్తామని ప్రకటించారు. రాబోయే మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీని కోసం ఆలయ సముదాయంలో 24 గంటలూ పని చేసే ప్రత్యేక బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్పీడ్ పోస్ట్ పార్శిల్ సర్వీస్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న భక్తుల ఇళ్లకు ప్రసాదం నేరుగా డెలివరీ చేయబడుతుంది.
నవంబర్ 17 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ 41 రోజుల మండల దీక్షా సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సదుపాయం కల్పిస్తున్నారు. భక్తులు ఆలయంలోనే ప్రసాదాన్ని బుకింగ్ చేసుకుని, తాము యాత్ర ముగించుకొని ఇళ్లకు చేరే సరికి పార్శిల్ అందేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, సన్నిధానంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పోస్టాఫీసుల ద్వారా కూడా భక్తులు ఈ ప్రసాదాన్ని తమ ఇళ్లకు పంపుకోవచ్చని అధికారులు తెలిపారు.

