కలం, యాదగిరిగుట్ట : అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా చితికిపోతున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనిలా అండగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన సుమారు 850 మంది అర్హులైన లబ్ధిదారులకు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరూ మెరుగైన వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఈ సహాయ నిధి ఎంతో ఊరటనిస్తుందని చెప్పారు. ప్రజల కష్టాలను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు.
ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని బీర్ల అయిలయ్య భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఏదైనా సమస్య తలెత్తితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆపద సమయంలో తమకు ఆర్థిక అండగా నిలిచి చెక్కులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

