చేపల వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ అభినందనీయం: ఎమ్మెల్యే రేవూరి

కలం, వరంగల్: చేపలు, రొయ్యల వ్యర్థాలను వృథా (Fish Waste) చేయకుండా సేంద్రియ ఎరువులుగా (Organic Fertilizer) మార్చడం అభినందనీయమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి (MLA Revuri Prakash Reddy) అన్నారు. మత్స్యకారులు అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ వినూత్న ఉత్పత్తుల తయారీ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. శనివారం గొర్రెకుంటలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు.

చేపలు, రొయ్యల వ్యర్థాలతో తయారు చేస్తున్న వర్మీ కంపోస్ట్ సేంద్రియ ఎరువును పరిశీలించి, తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా మత్స్యకారులు తయారు చేసిన చేపలు, రొయ్యల పచ్చళ్లను పరిశీలించి అభినందించారు. అనంతరం సంఘం సభ్యుల విజ్ఞప్తి మేరకు గుండ్లకుంటను సందర్శించారు. సమీపంలోని ప్రభుత్వ భూమిలో ఐదు ఎకరాలు కేటాయిస్తే పెద్దఎత్తున సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టేందుకు అవకాశం ఉంటుందని సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకార సంఘాల అభివృద్ధికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు సంపూర్ణ సహకారం అందిస్తామని రేవూరి హామీ ఇచ్చారు.

మహిళలు చేపలు, రొయ్యల పచ్చళ్లతో పాటు మరిన్ని విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో గుర్తింపు పొందేలా శిక్షణ, అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వై.వి. గణేష్, డీఆర్‌డీఓ నాగపద్మజ, జిల్లా మత్స్యశాఖ అధికారి పిల్లి శ్రీపతి, ఇతర అధికారులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>