కలం వెబ్ డెస్క్ : ఇండోనేషియా(Indonesia)లోని ఉత్తర సులవేసీ(North Sulawesi) ప్రావిన్స్‌లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు(flash floods) విధ్వంసం సృష్టించాయి. వరదలతో సిటారో ఐలాండ్స్(Sitaro Islands) రీజెన్సీలోని సియావు ద్వీపం(Siavu Island)లో భారీ నష్టం వాటిల్లింది. తాజా సమాచారం ప్రకారం 16 మంది మరణించగా, ముగ్గురు గల్లంతయ్యారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షంతో కొండల నుంచి దిగివచ్చిన నీటి ప్రవాహానికి కింది గ్రామాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రజల జీవనోపాధి పూర్తిగా నాశనమైంది. కనీసం ఏడు ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోగా, 140కి పైగా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 680 మందికి పైగా స్థానికులు చర్చిలు, ప్రభుత్వ భవనాల్లో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. అధికారులు 14 రోజుల పాటు హైడ్రోమెటియోరాలజికల్ డిజాస్టర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ కాలంలో సిబ్బంది, పరికరాలు, మానవతా సాయం వంటి అత్యవసర చర్యలు తీసుకునే అధికారం స్థానిక ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. వరదల ప్రభావం రీజెన్సీలోని అనేక ప్రాంతాలకు విస్తరించడం వల్ల, రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రక్షణ బృందాలు, పోలీసులు, సైనికుల సాయంతో గ్రామాల్లో కనిపించకుండా పోయిన వారి కోసం వెతుకుతున్నారు.


