కలం, నిర్మల్ : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ (Nirmal AITUC) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.విలాస్ డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్ జిల్లా ఇంద్రానగర్ ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విలాస్ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, సమ్మె కాలపు వేతనాలు విడుదల చేయడంతో పాటు సమ్మె సమయంలో నమోదైన పోలీసు కేసులను ఎత్తివేయాలని కోరారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, టీచర్లు, ఆయాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇకపై అంగన్వాడీలతో బీఎల్ఓ విధులు చేయించవద్దని, ఈ డిమాండ్‌కు మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి, గోపమ్మ, గోదావరి, లావణ్య, నీరజ, సంగీత, విజయలక్ష్మి, లలిత తదితరులు పాల్గొన్నారు.

