కలం, యాదగిరిగుట్ట: కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. యాదగిరిగుట్ట పుణ్య క్షేత్రం (Yadagirigutta Temple) ఆధ్యాత్మిక శోభతో కొత్త కళను సంతరించుకుంటుంది. ఎటుచూసినా భక్తుల సందడి.. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణలు.. సత్యనారాయణ స్వామి వ్రతాలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధి భక్తిభావంతో పులకించిపోతోంది. కార్తీక మాస పవిత్రతను పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సన్నిధికి చేరుకుంటున్న భక్తులు వ్రతాలు ఆచరిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. జీవితాల్లో సుఖసంతోషాలు, కుటుంబ క్షేమం కలగాలని స్వామివారిని వేడుకుంటున్నారు.
భక్తుల రాకతో యాదాద్రిలో పండుగ వాతావరణం!
కార్తీక మాసం సందర్భంగా పెరుగుతున్న భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఆలయ (Yadagirigutta Temple) అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వ్రతాలు నిర్వహించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తూ అవసరమైన పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఆధ్యాత్మిక సందడి.. మరోవైపు భక్తుల కోలాహలం.. ఇంకోవైపు మొక్కులు చెల్లించుకునే కుటుంబాలతో యాదాద్రి క్షేత్రం కళకళలాడుతోంది. కార్తీక మాసంలో యాదాద్రి క్షేత్రానికి పెరుగుతున్న ఈ భక్తజన ప్రవాహం తెలంగాణలోనే ప్రముఖ ఆధ్యాత్మిక ఆకర్షణగా మరోసారి యాదగిరిగుట్ట ప్రత్యేకతను చాటుతోంది.

