కలం, వెబ్ డెస్క్ : ఇంటింటా పూజలందుకునే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాలకు జీవం పోసిన ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) (SM Srinivasan) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో ఉన్న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కళాకారుడు కొండయ్య రాజు వద్ద చిత్రకళలో శిక్షణ పొందిన శ్రీనివాసన్, 1970లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆహ్వానం మేరకు ఆలయ గర్భగుడిలో మూలవిరాట్టును నేరుగా దర్శించి రెండు ప్రధాన చిత్రాలను రూపొందించారు.
స్వామివారు ఆభరణాలు అలంకరించుకున్న రూపంతో పాటు ఆభరణాలు లేని నిరాడంబర రూపాన్ని కూడా ఆయన అద్భుతంగా గీశారు. టీటీడీ ఆమోదంతో క్యాలెండర్లు, పోస్టర్ల రూపంలో విడుదలైన ఈ చిత్రాలు అనతికాలంలోనే దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో నిత్య పూజలందుకుంటూ చిరస్థాయిగా నిలిచిపోయాయి.

