పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు.. యువతి ఆత్మహత్య!

కలం, వెబ్ డెస్క్ : ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశయంతో ముందుకు సాగుతున్న ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువకుడు వేధిస్తున్నాడన్న (Marriage Harassment) ఆరోపణల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకోవడం నారాయణపేట (Narayanpet) జిల్లాలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా జౌల్లాపురం గ్రామానికి చెందిన అనిత (23) హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం పీజీ చదివేందుకు దరఖాస్తు చేసుకుంది.

గత ఏడాది రోడ్డు ప్రమాదంలో తండ్రి హన్మంతు మృతి చెందడంతో కుటుంబానికి కష్టాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ తన కూతురిని ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో తల్లి వెంకటమ్మ కూలి పనులు చేస్తూ పోషిస్తోంది. తండ్రి మరణంతో చదువు ఆపి పెళ్లి చేసుకోవాలని తల్లి సూచించినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు చదువుకుంటానని అనిత పట్టుబట్టింది. దీంతో తల్లి కష్టపడుతూ ఆమె చదువుకు అండగా నిలిచింది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌కు చెందిన అనిల్ అనే యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని అనితపై ఒత్తిడి తెస్తూ వేధించినట్లు స్థానికులు చెబుతున్నారు.

అతన్ని దూరం పెట్టినప్పటికీ వేధింపులు కొనసాగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కూతురి మృతదేహం వద్ద తల్లి వెంకటమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. ‘ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదాకా చదువుతానని చెప్పి నన్ను వదిలేసి వెళ్లిపోయావా బిడ్డా’ అంటూ గుండెలవిసేలా రోదించడం అక్కడివారిని కలచివేసింది. వెంకటమ్మ ఫిర్యాదు మేరకు అనిల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>