కలం, వెబ్ డెస్క్ : సంచలనం సృష్టించిన మహాదేవ్ ఆన్లైన్ బుక్ బెట్టింగ్ యాప్ కేసు (Mahadev Betting Case)లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తును వేగవంతం చేసింది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో ఈ అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్ ప్యానెల్ ఆపరేటర్ల నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
ఈ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ను ఇటీవల ఒమన్ నుంచి భారత్‌కు రప్పించి నవంబర్ 1న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాయ్‌పూర్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆయనను 8 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. విచారణలో భాగంగా సౌరభ్ చంద్రకర్ వెల్లడించిన కీలక సమాచారం ఆధారంగానే తాజా దాడులు జరిగాయి.
సోదాల సమయంలో పలు చోట్ల లైవ్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్యానెల్స్ నడుస్తుండటాన్ని అధికారులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. నిందితుల నుంచి డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లతో పాటు మ్యూల్ ఖాతాలు, హవాలా నెట్వర్క్ వినియోగానికి సంబంధించిన కీలక పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి బదిలీ చేసిన తర్వాత సంస్థ రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. విదేశాల్లోని ప్రధాన కార్యాలయం నుంచి ఈ యాప్‌ను నిర్వహిస్తూ, భారత్‌లోని ప్యానెల్ ఆపరేటర్ల నెట్వర్క్ ద్వారా దందా సాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇతరుల పేర్లపై తెరిచిన బ్యాంకు ఖాతాల్లో బెట్టింగ్ సొమ్మును జమ చేసి, ఆ లాభాలను హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
పోలీసు కస్టడీ ముగియడంతో సౌరభ్ చంద్రకర్‌ను నవంబర్ 12న రాయ్‌పూర్ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు నవంబర్ 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. విదేశాల్లో ఉన్న ఇతర నిందితుల అప్పగింతకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ అక్రమ కార్యకలాపాలకు సహకరించిన వ్యక్తులు, ప్రభుత్వ అధికారుల పాత్రపై కూడా లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ స్పష్టం చేసింది.

