కలం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం రాష్ట్ర నేతలతో సమావేశం కానున్నారు. ఆయన రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ, ప్రభుత్వ పనితీరుపై స్టేట్ లీడర్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్, సీనియర్ నేతలతో రాహుల్ ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. చాలా రోజుల తర్వాత రాష్ట్రానికి రాహుల్ వస్తుండడంతో ఆయనను కలిసేందుకు పార్టీ నేతలు పోటీ పడుతున్నట్టు తెలిసింది.
పార్టీలో విభేదాలపై చర్చ
ఇటీవల రాష్ట్ర నేతల మధ్య వివాదాలు, విభేదాలు తలెత్తడం, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు వివాదాస్పద కామెంట్లు చేయడంతో.. ఆ అంశాలపై నేతలతో జరిగే సమావేశంలో రాహుల్ చర్చిస్తారా? అన్న ఉత్కంఠ నెలకొన్నది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా రాహుల్ (Rahul Gandhi) దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సైతం పలు సూచనలు చేసే చాన్స్ ఉంది. ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణం, అటు ప్రత్యర్థి పార్టీల విమర్శలకు దీటుగా జవాబు ఇవ్వడంతో పాటు అంతర్గత సమస్యలపైనా రాహుల్‌తో భేటీలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి అంశాలపై కొందరు ఫిర్యాదులు చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.

