కలం, వెబ్ డెస్క్: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో భారత్‌లో ఆరోగ్య సంక్షోభం (Health Emergency India) తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఈ పరిస్థితిని అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తూ గ్రేడ్-3 ఎమర్జెన్సీని ప్రకటించి, భారత్‌ను హైరిస్క్ జాబితాలో చేర్చింది. 2027 సెప్టెంబర్ వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై, ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటాయని WHO అంచనా వేసింది.
తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు డీహైడ్రేషన్, వడదెబ్బ బారిన పడే ముప్పు పొంచి ఉంది. దీనికి తోడు డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వేగంగా ప్రబలే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా గుండె, కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ వాతావరణ మార్పులు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో పంటల దిగుబడి తగ్గి, దేశంలో ఆహార సంక్షోభం కూడా తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆరోగ్య రంగాన్ని తక్షణమే అప్రమత్తం చేయాలని WHO సూచించింది.

