సదర్ ఉత్సవంలో పాల్గొన్న‌ శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తూ, భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీడీ గుట్ట ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం దున్నపోతుల విన్యాసాలు, ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయని, నేటి యాంత్రిక జీవన విధానంలో మన పూర్వీకులు అందించిన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ తలుపులు తెరిచే పవిత్రమైన సంప్రదాయంలో కూడా యాదవ వంశీయులకు ప్రత్యేక స్థానం ఉందని, ఇది యాదవుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి నిదర్శన‌మ‌ని ఆయన పేర్కొన్నారు. ప్రకృతిని, గ్రామదేవతలను పూజించడం, పశుసంపదను దైవంగా భావించడం మన పూర్వీకుల నుంచి వస్తున్న గొప్ప సంస్కృతి అని, ఇలాంటి సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన తెలిపారు. సదర్ ఉత్సవాలు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, యాదవుల సంస్కృతి, ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీక. ఇలాంటి పండుగలు మనలో ఐకమత్యాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. వృత్తి కులాల వారందరూ తమ తమ ఆచార సంప్రదాయాలను గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉండాలని, కులవృత్తుల ప్రాధాన్యతను గుర్తిస్తూ పరస్పర సహకారంతో సమాజ అభివృద్ధికి పాటుపడాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>