కలం, అచ్చంపేట: నల్లమల అడవుల్లోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని వటువల్లపల్లి (Vatvarlapally) గ్రామ ప్రజల తరలింపు పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. ఆయన శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకమై రీ లోకేషన్ తో పాటు, గ్రామ అభివృద్ధి పై పలు అంశాల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాలకులు,అధికారులు గ్రామంలో అడవినే నమ్ముకుని జీవిస్తున్న చెంచు గిరిజనులకు 1996 పిసా చట్టం, ఆదివాసీలకు అడవి భూముపై పూర్తి హక్కులు ఉంటాయని చట్టం 1/70 చెబుతువుందని సూచించారు. దాంతోపాటు అడవి హక్కు చట్టం 2006 కూడా ఆదివాసీ చెంచు గిరిజనులకు ఉందని గుర్తు చేశారు. కాబట్టి గ్రామంలో జీవించి ఉండాలనుకునే వారికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, సహాయ కార్యదర్శులు జక్కా బాలయ్య, రమేష్ చందర్ తిరుమల, సభ్యులు బియ్యని వెంకటేష్,మదునూరు లక్ష్మీనారాయణ, బాలయ్య, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, ఆ గ్రామ ప్రజలు,చెంచులు తదితరులు పాల్గొన్నారు.

