కలం, వెబ్ డెస్క్: హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత కేవలం మత గ్రంథం మాత్రమే కాదని.. భారతీయ జీవన విధానాన్ని ఆవిష్కరించే అద్భుతమైన సమగ్ర జీవన శాస్త్రమని అభివర్ణించారు. వేదాలు, భగవద్గీత ఎప్పటికీ ఆధునికమైనవేనని అన్నారు. శుక్రవారం హైదరాబాద్ -మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ‘భగవద్గీత ఇన్ ది లెన్స్ ఆఫ్ న్యూరోసైన్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భగవద్గీత (Bhagavad Gita) సారాన్ని నేటి ఆధునిక జీవన విధానానికి అనువర్తిస్తూ ఈ పుస్తకాన్ని రచించిన ప్రముఖ న్యూరో సైంటిస్ట్ డా.శ్రీనాథన్ కృషి అభినందనీయమని కొనియాడారు.
యుద్ధం చేయనంటూ ధనుర్భానం కింద వేసి నిరుత్సాహంతో ఉన్న అర్జునుడికి.. సమస్త జ్ఞానాన్ని భోదించి యుద్ధం చేసేలా ధైర్యం కల్పించిన సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణుడి మాటలే.. భగవద్గీత అని కిషన్ రెడ్డి (Kishan Reddy) కొనియాడారు. భగవద్గీతలోని ప్రాచీన జ్ఞానాన్ని, ఆధునిక న్యూరో సైన్స్‌తో అనుసంధానిస్తూ మెదడు పనితీరు, ఒత్తిడి, కోపం, భయం, ఆందోళనలను నియంత్రించుకోవడానికి మార్గదర్శనం చేస్తుందని అన్నారు. ఏకాగ్రతను పెంచుకోవడం వంటి అంశాలపై ఇది నేటి యువతకు, వైద్య వృత్తిలో ఉన్నవారికి భావితరాలకు భగవద్గీత ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఒక వ్యక్తి ఎలా ఆలోచించాలి, బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పే ఈ మహా జ్ఞానమే భగవద్గీత అని అన్నారు. లక్ష సంవత్సరాల తర్వాత కూడా అవి మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందన్నారు.
శ్రీకృష్ణ భగవాన్ బోధించిన ‘కర్మయోగం’ స్ఫూర్తితో ఫలితాన్ని ఆశించకుండా నిబద్ధతతో పనిచేయడం వల్లే సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ఎందరో నేడు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఫలితాన్ని ఆశించకుండా కర్మయోగ స్ఫూర్తితో పనిచేయడం వల్లే సాధారణ స్థాయి నుంచి ప్రధాని, ఉపరాష్ట్రపతి స్థాయికి మోదీ, వెంకయ్యనాయుడు చేరారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి వర్చువల్ గా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకాగా.. పలువురు ప్రముఖులు సభకు హాజరయ్యారు.
Also Read : ఇసయ్యా అరుమై నాయగంకు అర్జున అవార్డ్!
Follow Us On : WhatsApp

