చిల్డ్ర‌న్స్ డే వేడుక‌ల్లో కలెక్టర్ ప్రియాంక

కలం, నారాయణపేట: విద్యార్థులు పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలని కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్ గార్డెన్స్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో – బేటీ పడావో’లో భాగంగా ప్రపంచ బాలల దినోత్సవ వేడుకలను (Childrens Day) ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరై జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నవంబర్ 14న భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు జీవితంలో పెద్ద పెద్ద కలలు కనాలని, భవిష్యత్తులో తాము ఏ స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.

రాకెట్ సైంటిస్టులు, జిల్లా కలెక్టర్లు, ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్లు, గొప్ప పారిశ్రామికవేత్తలు కావాలనే ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని అన్నారు. అయితే కలలు కనడంతోనే సరిపోదని, వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం కష్టపడి చదవాలని సూచించారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై సమాన ఆసక్తి పెంచుకోవాలని, తమకు ఇష్టమైన విషయాల్లో మరింత ప్రతిభ కనబరుస్తూనే, కష్టంగా భావించే సబ్జెక్టులను కూడా శ్రద్ధగా నేర్చుకోవాలని తెలిపారు. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించుకోవాలని, ఉపాధ్యాయులను ప్రశ్నలు అడుగుతూ విషయాలను లోతుగా అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.

పుస్తక జ్ఞానంతో పాటు సమాజం, పరిసరాలు, దేశంలో జరుగుతున్న విషయాలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. అదేవిధంగా కులం, మతం, ప్రాంతం, ఆడ, మగ అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించాలని కలెక్టర్ సూచించారు. ఇతరులలోని భిన్నత్వాన్ని గౌరవించాలని, ఎవరినీ తక్కువ చేసి చూడకూడదని, తోటి విద్యార్థులను వేధించడం, ఎగతాళి చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.

పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, పాఠశాలల్లోని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పుస్తక పఠనం వల్ల ఆలోచనా పరిధి, సృజనాత్మకత, జ్ఞానం పెరుగుతాయని అన్నారు. విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకొని, క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ, విజేతలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ రకాల పోటీలలో విజేతలైన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజేందర్ గౌడ్, డీఈఓ గోవింద రాజులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ అశోక్, జిల్లా సైన్స్ అధికారి భాను ప్రసాద్, ఎంఈఓ బాలాజీ, ఏ ఎం వో విద్యా సాగర్, రాజేంద్ర కుమార్, డీసీపీవో కరిష్మా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>