కలం, నిజామాబాద్ బ్యూరో : రాబోయే రబీ 2026-27 సీజన్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని, రైతులను వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Sanjay Jaju) సూచించారు. కూరగాయలు వంటి ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్, సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, విద్యాశాఖ, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, వీబీజీరాంజీ పనుల పురోగతిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ పలు అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రబీ 2026-27 సీజన్లో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేనందున వరి సాగును నివారించాలని అన్నారు. పంటల వైవిధ్యీకరణ, పంటల ఉత్పాదకత పెంపు, రైతు రిజిస్ట్రీ నమోదు, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుతో కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇతర పథకాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
అలాగే ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్లో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు. రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించినప్పటికీ, కనీస మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం విక్రయించి రైతులు నష్టపోకుండా చూడాలని స్పష్టం చేశారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనుగోళ్లకు సిద్ధంగా ఉంచాలని, రైతులందరి వివరాల నమోదు(ఫార్మర్ రిజిస్ట్రీ) ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం సేకరణ ప్రక్రియను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ప్రభుత్వ అభివృద్ధి పనులు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని సీఎస్ తెలిపారు. భూసేకరణ కోసం అవసరమైన నిధులను కలెక్టర్ల వద్ద అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు నిధులు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. వీబీజీరాంజీ కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, జలసిరి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ సూచించారు.
ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ఖరీఫ్ లో వర్షాలు అనుకూలించడం వల్ల జిల్లాలో రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారని, దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో వస్తున్నాయని, మంచి ధర లభిస్తోందని సీఎస్ దృష్టికి తెచ్చారు. అయితే ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరి సాగు చేయడం ఎంతమాత్రం తగదని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు రైతు వేదికల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఏఓ వీరస్వామి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

