కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి (Kulgam Terror Attack)కి సంబంధించి ఆర్మీ వేట కొనసాగుతోంది. తప్పించుకున్న ముష్కరుల కోసం మూడు రోజులుగా సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పెద్ద ఎత్తున డ్రోన్లతో రంగంలోకి దింపి అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదుల ఆచూకీ చెప్పినవారికి రూ.30 లక్షల పారితోషికం ఇస్తామని కిశ్త్‌వాడ్ జిల్లా పోలీసులు పోస్టర్లు విడుదల చేశారు. ఇద్దరు పోలీసులు మృతి చెందిన డచ్చన్ అటవీ ప్రాంతాన్ని జమ్మూ ఐజీ తేజీందర్ సింగ్ పరిశీలించారు. ఇక ఉగ్రవాదులు దాడి చేసిన ప్రాంతాన్ని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ తనిఖీ చేసి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎలా వచ్చారు.. ఎలా వెళ్లారు..?
కుల్గాం పట్టణంలోని మీర్ బజార్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ పోస్టుపై బుధవారం మధ్యాహ్నం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటన(Kulgam Terror Attack)లో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు అక్కడికి నడచుకుంటూ వచ్చి.. కాల్పులు జరిపాక బైక్‌పై పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అటవీ ప్రాంతం ఉండటంతో ఎటు వైపు వెళ్లారనేది మాత్రం అస్పష్టంగా మారింది. ఏకే 47తో కాల్పులకు తెగబడినట్లు నిర్ధారించారు. ఇదే సమయంలో.. పెట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు పోలీసులు కనిపించకుండా పోయి మరుసటి రోజు విగతజీవులుగా కనిపించారు. వారి శరీరాలపై బుల్లెట్ గాయాలు ఉండటంతో ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనేనని స్పష్టమవుతోంది. ఈ రెండు ఘటనలకు పాల్పడింది ఒకే ఉగ్ర ముఠానా..? వేర్వేరా..? అనేది దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : సమృద్ధి హైవేపై కంటైనర్ బీభత్సం.. నుజ్జునుజ్జయిన కార్లు!
Follow Us On : WhatsApp

