కలం, కరీంనగర్ బ్యూరో : రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి, వారికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) కోరారు. శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలంలోని చామన్‌పల్లి, చర్లబూత్కూర్, ముగ్ధంపూర్ గ్రామాల్లో ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం రైస్ మిల్లర్లు నేరుగా గ్రామాలకు వచ్చి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం తగ్గుతోందన్నారు. బహిరంగ మార్కెట్లో క్వింటాల్ ధాన్యానికి రూ.3,100 వరకు ధర లభిస్తుండగా, ప్రభుత్వ కొనుగోలు ధర రూ.2,900 ఉంటే రైతులు ప్రభుత్వ కేంద్రాలకు ఎందుకు ధాన్యం విక్రయిస్తారని ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్ ధరకు సమానంగా ప్రభుత్వం ధర కల్పిస్తే రైతులంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తీసుకొస్తారని పేర్కొన్నారు.
హమాలీ ఖర్చులు, తాలు, తరుగు పేరుతో రైతులకు అదనపు భారం పడకుండా చూడాలని సూచించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతుల వద్దకే వచ్చి ప్రైవేటు వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో పండిన ధాన్యం మన రాష్ట్ర అవసరాలకే ఉపయోగపడేలా సివిల్ సప్లై ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కోరారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై రైతులకు నమ్మకం కలిగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, బహిరంగ మార్కెట్ ధరకు సమానంగా ధర చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఈసారి 25 నుంచి 30 శాతం ధాన్యం మాత్రమే వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గంగుల కమలాకర్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, కరీంనగర్ ఫ్యాక్ట్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, దుర్షెడ్ ఫ్యాక్స్ చైర్మన్ తోట తిరుపతి, చామనపల్లి సర్పంచ్ బోగొండ ఐలయ్య, చర్లబూత్కూర్ సర్పంచ్ కూర నరేష్ రెడ్డి, ముగ్దమ్ పూర్ సర్పంచ్ సీనమ్మ , పలువురు గ్రామ ప్రతినిధులు, ఫ్యాక్స్ డైరెక్టర్లు, అధికారులు, రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

