ఉపాధి హామీని పక్కదారి పట్టిస్తున్న కేంద్రం: మహేశ్ గౌడ్

కలం, వెబ్ డెస్క్: సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ హయాంలో జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభమైందని.. పేదలకు 100 రోజుల ఉపాధి కల్పించడమే ఉపాధి హామీ పథకం లక్ష్యమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన ఈ పథకాన్ని కేంద్రం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం సంపన్నులకే ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలన్నదే నెహ్రూ ఆశయమని పేర్కొన్నారు. హైదరాబాద్ లో రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్‌ రెండవ ఎడిషన్ (Bharat Summit) కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ – ఎకనామిక్ జస్టిస్‌పై మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగించారు.

మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందే సమాన అభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించడమే ప్రజాపాలన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, ములుగు, నారాయణపేటలోనూ పరిశ్రమలు రావాలని కోరారు. రాష్ట్ర ఆదాయంలో 40 శాతం హైదరాబాద్ నుంచే అందుతుందని.. ఇదీ అభివృద్ధిలో అసమతుల్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 80 వేలకు పైగా ఉద్యోగాలను కల్పించిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల ఆకాంక్షతో సాగిందని.. ఉద్యోగాల కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మహేశ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అప్పులకు ఏటా రూ.6,500 కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నామని అన్నారు. అప్పుల భారం ఉన్నా సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నామని చెప్పారు. సంపన్నులు తినే సన్నబియ్యం పేదలకు కూడా అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని.. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సాయం చేస్తున్నామని చెప్పారు. దాదాపు 70 శాతం కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>