తీన్మార్ మల్లన్న కారుకు ప్రమాదం.. ఢీకొట్టిన లారీ

‎కలం, మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అనాజీపురం వద్ద శుక్రవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారును ఒక లారీ బలంగా ఢీ కొట్టింది (Teenmar Mallanna Car Accident). ఈ ఘటనలో తీన్మార్ మల్లన్నకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో కారును డ్రైవర్ బన్నీ నడుపుతుండగా, అందులో మల్లన్న అత్యంత సన్నిహితుడు రంగన్న ఉన్నట్లు సమాచారం. లారీ ఢీకొట్టిన ధాటికి కారు దెబ్బతినడంతో పాటు బన్నీ, రంగన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మల్లన్న కారును ఢీకొట్టిన అనంతరం, అదుపుతప్పిన లారీ అక్కడే ఉన్న మరో కారును కూడా ఢీకొట్టింది. ఆ కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కాగా, వారితో ఉన్న చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడింది. రెండు రోజుల క్రితమే తీన్మార్ మల్లన్న పాదయాత్ర సందర్భంగా స్థానిక కాంగ్రెస్ సర్పంచ్‌తో వివాదం చోటుచేసుకుంది.

ఈ నేపథ్యంలో, పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన (Teenmar Mallanna Car Accident) జరగడంపై టీఆర్పీ నాయకులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధారణ రోడ్డు ప్రమాదమేనా లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది. సమాచారం అందుకున్న మోత్కూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అసలు కారణాలు, టీఆర్పీ నాయకులు వ్యక్తం చేస్తున్న కుట్ర ఆరోపణల కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>