కలం, ఖమ్మం బ్యూరో : వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల్లోనే ఓ రెండు నెలల పసికందు అనూహ్యంగా మృత్యువాత పడిన విషాద ఘటన ఖమ్మం (Khammam) జిల్లా కూసుమంచి మండలం పోచారంలో చోటుచేసుకుంది. అప్పటివరకు ఉత్సాహంగా ఉన్న చిన్నారి మృతి చెందడంతో, టీకా వికటించడం వల్లే ఇలా జరిగిందా? అనే కోణంలో వైద్యాధికారులు విచారణ చేపట్టారు.
అసలేం జరిగింది?
పోచారం గ్రామానికి చెందిన మొక్క రాజు, గౌతమి దంపతుల రెండవ సంతానమైన నివాన్సిక (2 నెలలు) గురువారం సాయంత్రం మృతి చెందింది. సెప్టెంబర్ 16న 1.9 కిలోల తక్కువ బరువుతో జన్మించిన ఈ చిన్నారి, ఆ తర్వాత క్రమంగా బరువు పెరుగుతూ ఆరోగ్యంగా, ఉత్సాహంగానే ఉంటోంది. ఈ క్రమంలో బుధవారం గ్రామంలో ఏఎన్‌ఎం ద్వారా చిన్నారికి పెంటావాలెంట్, రోటా వైరస్, ఓపీవీ, పీసీవీ టీకాలను వేయించారు.
అదే రోజు కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్‌సీ) ఎఫ్‌ఐపీవీ టీకా కూడా ఇచ్చారు. టీకాలు వేయించిన తర్వాత బుధవారం సాయంత్రం చిన్నారి శరీరం వేడెక్కడంతో, వైద్యుల సలహా మేరకు తల్లిదండ్రులు సిరప్ తాగించారు. అయితే, గురువారం సాయంత్రానికి చిన్నారి పరిస్థితి విషమించి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయింది.
వైద్యాధికారి వివరణ:
చిన్నారి మృతికి టీకా కారణం కాకపోవచ్చని కూసుమంచి వైద్యాధికారి డాక్టర్ సాయికుమార్ ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. “బుధవారం ఇదే గ్రామంలో మరో ఇద్దరు చిన్నారులకు టీకాలు వేశాం. అలాగే పీహెచ్‌సీలో 28 మందికి ఎఫ్‌ఐపీవీ టీకా ఇచ్చాం. వారందరూ క్షేమంగానే ఉన్నారు. నివాన్సిక మృతికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతాం” అని ఆయన స్పష్టం చేశారు.

