ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ : ఎమ్మెల్యే విజయరమణ రావు

కలం, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట, కొనరావుపేట గ్రామాల్లో జూలపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు (MLA Vijayaramana Rao), స్థానిక నాయకులతో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement Centres) ప్రారంభించారు. అనంతరం జూలపల్లి ఎం.పి.డి.వో కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు రూ. 21,02,436/- విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేశారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. రైతులకు మద్దతుగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అలాగే రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందిస్తున్నట్లు వెల్లడించారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని, యాసంగిలో వరి సాగుకు బదులుగా మొక్కజొన్న, శనగ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. ఎల్నినో ప్రభావంతో సాగు, తాగునీరుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంటుందని, దీన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

జనవరి నుంచి విపరితమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశా లున్నాయని, వాటిని తాగునీటికి కరువవుతుందని, ఎవరైనా చెరువులు, కుంటలు తూము నుంచి నీళ్లు వదిలివేయడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరుతడి పంటల్లోనూ స్వల్పకాలిక పంటలను మాత్రమే సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు మరియు పలు గ్రామాల సర్పంచ్లు, పలు శాఖల అధికారులు, రైతులు ,లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>