కేటీఆర్ విమర్శలకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కౌంటర్

కలం, నిర్మల్: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖజానాను ఖాళీ చేసిన కేసీఆర్ కుటుంబాన్నీ, కేటీఆర్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు గర్జన సభలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఎమ్మెల్యే గురువారం ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కరువు వచ్చిందని కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. కుటుంబంలో సంపద పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలే కేటీఆర్, హరీశ్‌రావు, కవిత మధ్య విభేదాలకు కారణమని ఆరోపించారు.

గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టినా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, రుణమాఫీతో పాటు నూతన రేషన్ కార్డులు, పెన్షన్ల మంజూరు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రాబోయే రెండేళ్లలో మరిన్ని కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు కార్యకర్తల కొరత ఏర్పడిందని, రైతు గర్జన సభకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి జనాన్ని తరలించాల్సి వచ్చిందని విమర్శించారు. సభ ఆశించిన స్పందన పొందలేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామాల్లో పోటీ చేసేందుకు కూడా బీఆర్ఎస్ నాయకులు ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు. కేటీఆర్ ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారని, వచ్చే ఎన్నికల్లోనూ రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకొని గత పదేళ్ల పాలనలో చేసిన తప్పులకు సమాధానం చెప్పాలని హితవు పలికారు. కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రానివ్వకుండా ప్రజాక్షేత్రంలోనే రాజకీయంగా ఎదుర్కొంటామని అన్నారు.బాసర నుంచి భద్రాచలం వరకు టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, నిర్మల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల హరీష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి జునైద్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>