కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రులలో (Government Hospital) చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య,సెక్యూరిటీ, పేషంట్ కేర్, సూపర్వైజర్ కార్మికుల (Contract Workers) ఆకలి గోస ప్రభుత్వానికి పట్టాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కనీస వేతనం 26 వేలకు పెంచాలని, కాలపరిమితి ముగిసిన ప్రస్తుత ఏజెన్సీ టెండర్లను రద్దు చేయాలని, ఒకటవ తారీఖు నాడే కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలన్నారు.
పీఎఫ్ ఈఎస్ఐలు సక్రమంగా చెల్లించాలని కార్మికుల సంఖ్య పెంచి పని భారం తగ్గించాలని కోరారు. కార్మిక సమస్యల పరిష్కారానికి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) నేతృత్వంలో గురువారం నుండి నిర్వహించ తలపెట్టిన ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల రాష్ట్రవ్యాప్త నిరవధిక ఆందోళనలో భాగంగా తొలి రోజు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ విభాగాలు కార్మికులు విధులు బహిష్కరించి ఆసుపత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించి అత్యవసర విభాగం ఎదుట ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో వెట్టి చాకిరికి గురవుతున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి కారణంగా కార్మికులు తీవ్రమైన ఆర్థిక శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో కాంట్రాక్టు కార్మికులకు కన్నీళ్లే మిగులుతున్నాయని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొస్తే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతన అమలు చేస్తామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంట్రాక్టు ఏజెన్సీల విధానం రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు గడుస్తున్నా ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తాజాగా కనీస వేతనాలను సవరిస్తూ జీవో నెంబర్ 6 విడుదల చేసిందని కానీ కనీసం ఆ పెంచిన కనీస వేతనాలు కూడా ఆసుపత్రి కాంటాక్ట్ కార్మికులకు వర్తింప చేయలేదని అన్నారు. ప్రస్తుతం నడుస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు ఐదేళ్లు గడుస్తుందని కాల పరిమితి కూడా ముగిసిపోయి రెండేళ్లు కావస్తుందని కానీ ఆ ఏజెన్సీలను రద్దు చేయకుండా పాత ఏజెన్సీలకే అనుమతులు పెంచడం చేత కార్మికులకు జీతాలు పెంచకుండా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞాపనలు చేసిన పలు దశల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు.
కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని గత నెల 22న డియంఈ, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ శాఖ అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కి సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ ఏ మాత్రం స్పందన లేని కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే కార్మికులతో చర్చలు జరిపి, కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుని సమ్మెను విరమింప చేయాలని లేనిచో ఆందోళనను రోజురోజుకు ఉదృతం చేస్తామని తెలిపారు.
తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యం.మధుసూదన్ రెడ్డి ఆసుపత్రి కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ..సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని జాతీయ పండుగ ఆర్జిత 23 సెలవులను వేతనంతో కూడిన సెలవులకు మంజూరు చేయాలని, ఒక నెల జీతాన్ని బోనస్‌గా చెల్లించాలని కోరారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్షులు గోపాల్ నాయక్ సంఘీభావం తెలిపే ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఎంజిజిహెచ్ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ బ్రాంచ్ యూనియన్ అధ్యక్షులు రంగన్న అధ్యక్షత వహించగా నేతలు,కార్మికులు బి.చెన్నయ్య,జే. నరసింహ,బాలకోటి,రాఘవేందర్, అంజి, శ్రీనివాస్ రెడ్డి, చెంచు అంజలయ్య, మున్నా, భీమయ్య, మన్నెం, యాదయ్య,యుగేందర్ రెడ్డి, యాదగిరి, నైసన్, వెంకటయ్య, కృష్ణ, రాఘవేందర్, శ్రీను, శ్రీశైలం బాల్ రాజ్, కాండ శ్రీను, బాల్ రాజ్, గంగాధర్ గోపి, సత్తయ్య, పద్మ, నాగమణి, ఎల్లమ్మ, పద్మ, వరలక్ష్మి, శిరీష, చంద్రకళ, అలివేలమ్మ, తిరుపతమ్మ, లక్ష్మి,జంగమ్మ, మీనా, కవిత, సంజనా, జ్యోతి, నిర్మల, మమత, సునీత, మంజుల, జమున, అరుణ, సాయమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

