కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో జరిగే భారత్ సమ్మిట్ సందర్భంగా ఈ నెల 14న గిగ్ వర్కర్లతో (Telangana Gig Workers) రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి (Vivek Venkatswamy) స్పష్టం చేశారు. శిల్పకళా వేదిక నుంచి హెచ్ఐసీసీ వరకు జరిగే ఈ ర్యాలీలో తమ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొంటారని చెప్పారు. ఈ ర్యాలీలో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక యాప్‌తో పాటు ప్రమాద బీమా, సంక్షేమానికి సంబంధించి రాహుల్ గాంధీ కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ కొండాపూర్‌లోని UPZY హబ్‌లో గురువారం గిగ్ వర్కర్లతో మంత్రి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారితో ఆత్మీయంగా మాట్లాడి, వారి పని పరిస్థితులు, సమస్యలు తెలుసుకున్నారు.
మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 6 లక్షల మంది గిగ్ వర్కర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక భద్రత తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. భవిష్యత్తులో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గిగ్ వర్కర్ల సంక్షేమం కొరకు ఇచ్చిన హామీని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని వివేక్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో మెజారిటీ హామీలను అమలు చేశామని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రతే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని.. ప్రతి కార్మికుడికి గౌరవప్రదమైన జీవితం కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు.

