కలం, వెబ్ డెస్క్: జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ జానయ్య (VC Aldas Janaiah) పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు తెలంగాణలో సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కె. లక్ష్మి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో ఐఏఎస్ అధికారులు రాహుల్ రాజ్, యాస్మిన్ బాషా, బి. గోపితో పాటు ప్రజ్వల ఎన్జీవో ప్రతినిధి కృష్ణన్ సభ్యులుగా ఉన్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలపడ 15 రోజుల్లో విచారణ పూర్తి సేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి సూచించింది. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. కాగా, పీహెచ్ డీ పూర్తి చేసేందుకు గడువు పొడిగించాలని కోరినందుకు వీసీ జానయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా అసెస్టెంట్ ప్రొఫెసర్ ఆరోపించారు. తనను మానసికంగా, వ్యక్తిగతంగా వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు విదేశాల్లో పనిచేస్తున్న తన భర్తను వదిలేయాలని ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నిసార్లు పోలీసులను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేనందునే మహిళా కమిషన్ ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ వీసీ జానయ్యకు నోటీసులు జారీ చేయగా ఆయన తన లాయర్ తో కలిసి కమిషన్ ఎదుట హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వం మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

