కలం, యాదగిరిగుట్ట: రైతు కష్టానికి గిట్టుబాటు రావాలంటే పంట పండించడమే కాదు.. పండించిన పంటను భద్రంగా నిల్వ చేసుకునే సదుపాయాలు కూడా ఉండాలి. ఈ దిశగా ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కీలక ముందడుగు పడింది. 2,500 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసుకునే సామర్థ్యంతో నూతనంగా నిర్మించిన గోదామును (New Grain Storage) ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(MLA Beerla Ilaiah) ప్రారంభించారు. పంట చేతికొచ్చిన సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, మార్కెట్లో విక్రయాలకు ఆలస్యమైనా రైతులు ఇబ్బందులు పడకుండా ఈ గోదాము ఉపయోగపడనుంది. వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకునేందుకు ఈ నిల్వ కేంద్రం దోహదం చేయనుంది.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రజాపాలన ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.పంట పండించే రైతుకు నిల్వ భరోసా.. అమ్ముకునే రైతుకు అదనపు అవకాశం.. ఈ రెండు అంశాల్లో నూతన గోదాము ఎంతవరకు ఉపయోగపడుతుందో దాని నిర్వహణ, రైతులకు అందుబాటులో ఉండే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఆలేరు రైతులకు ఈ గోదాము పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూర్చాలని స్థానికంగా ఆశాభావం వ్యక్తమవుతోంది.

