కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం (Mamillagudem) 45వ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై అధికారులు, నేతలు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం అర్బన్ డీసీసీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి (Nagandla Deepak Chowdary) ఈ పాఠశాలలను అకస్మాత్తుగా సందర్శించి, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం చేసిన ఆయన, భోజన రుచి, నాణ్యతా ప్రమాణాలతో పాటు పాఠశాలలో అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ బడుల్లో పౌష్టికాహారం ఎంతో నాణ్యంగా అందుతోందని, బోధనా తీరు కూడా బాగుందని విద్యార్థులు ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై దీపక్ చౌదరి చర్చించారు. ఉపాధ్యాయులు తమ దృష్టికి తీసుకువచ్చిన అంశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి, వాటి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దీపక్ చౌదరి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ ముజీబ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

