ఇది ఎల్‌నినో కరువు కాదు.. కేసీఆర్ తెచ్చిన కరువు: ఎంపీ వంశీకృష్ణ

కలం, పెద్దపల్లి: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులకు ఎల్‌నినో ప్రభావమే కారణమని చెప్పడం సరికాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన వైఫల్యాలే నేటి పరిస్థితులకు కారణమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Vamsi Krishna) విమర్శించారు. మంగళవారం పెద్దపల్లి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

“ఇది ఎల్‌నినో ప్రభావంతో వచ్చిన కరువు కాదు.. కేసీఆర్ తెచ్చిన కరువు” అని ఎంపీ వంశీకృష్ణ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో జరిగిన వైఫల్యాలు, ప్రజాధనం దుర్వినియోగం ఫలితంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని ఆరోపించారు. లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు పరిస్థితి నేడు దయనీయంగా మారిందని ఎద్దేవా చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఎంపీ విమర్శించారు. పంపులు ఆన్ చేయాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ భద్రతపై జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణులు, సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి భద్రతపై ధ్రువీకరణ ఇవ్వడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. బ్యారేజీకి మరమ్మతులు చేసి, భద్రతపై స్పష్టమైన ధ్రువీకరణ వచ్చే వరకు పంపులు ఆన్ చేయడం సాధ్యం కాదని తెలిపారు.

“కేటీఆర్ గారూ.. మీకు మేడిగడ్డ బ్యారేజీపై అంత నమ్మకం ఉంటే, మీరే అక్కడికి రండి. కుంగిపోయిన బ్యారేజీ కింద నిలబడి మీరే పంపులు ఆన్ చేయించండి. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని మీరు అంత ధైర్యంగా చెబుతున్నప్పుడు ఆ ధైర్యాన్ని చేతల్లో చూపించండి. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోండి” అని ఎంపీ వంశీకృష్ణ సూటిగా సవాల్ విసిరారు.

ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. జాతీయ స్థాయి నిపుణుల నుంచి పూర్తి భద్రతా ధ్రువీకరణ వచ్చిన తర్వాతే ప్రాజెక్టు వినియోగంపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రాజెక్టు వైఫల్యాలకు బాధ్యత వహించాల్సింది పోయి, ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం తగదని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>