కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో రెస్టారెంట్లు, హోటళ్లు, క్లౌడ్ కిచెన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా సోదాలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ ఎక్స్ పైరీ అయిన ఆహారాన్ని సీజ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నగరంలోని మెహెఫిల్, షా గౌస్, పిస్తా హౌస్, సత్తిబాబు బిర్యానీ, చైతన్య కర్రీ పాయింట్ తదితర హోటళ్లలో తనిఖీలు చేసి భారీ మొత్తంలో కుళ్ళిన ఆహారాన్ని సీజ్ చేశారు. పలు రెస్టారెంట్లు, హోటళ్లకు సైతం నోటీసులు ఇచ్చారు.
తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని క్లౌడ్ కిచెన్ (Cloud Kitchens)లపై మంగళవారం దాడులు (Food Safety Raids) నిర్వహించారు. క్లౌడ్ కిచెన్లలో 15 బాక్సుల ఫుడ్ కలర్స్ స్వాధీనం చేసుకున్నారు. కొన్నింటికి షోకాజ్, మరికొన్నింటికి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. క్లౌడ్ కిచెన్లలో అపరిశుభ్రత, ఆహార భద్రతా ఉల్లంఘనలపై అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
ముఖ్యంగా మాదాపూర్ లోని ప్రముఖ క్లౌడ్ కిచెన్ అయిన బేకింగో (Bakingo) యూనిట్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన దాదాపు 60 కిలోల కేక్ బేస్‌లను గుర్తించారు. వీటిని ఉపయోగించి కేకులు తయారు చేసి, కృత్రిమంగా ఎక్కువ గడువు ఉన్నట్లు లేబుల్స్ వేసి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తేల్చారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఆ నిల్వలను ధ్వంసం చేసి, యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

