కలం, నిర్మల్: ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన గులాబీ పార్టీకి నిర్మల్ (Nirmal BRS) జిల్లాలో మాత్రం ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి ఇంకా కోలుకోకముందే పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. ఓవైపు గ్రామస్థాయిలో క్యాడర్‌ను కాపాడుకోవడం కష్టంగా మారుతుంటే.. మరోవైపు పార్టీని బలోపేతం చేసే పేరుతో జరుగుతున్న నూతన చేరికలు పాత నాయకుల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీని బలోపేతం చేయాల్సిన చేరికలే అంతర్గత కలహాలకు ఆజ్యం పోస్తున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో గులాబీ నేతల మధ్య సమన్వయ లోపం పార్టీకి సవాలుగా మారుతోంది.
ఖానాపూర్‌లో జాన్సన్ నాయక్ దూకుడు..
ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భూక్యా జాన్సన్ నాయక్ (Bhukya Johnson Naik) కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. సొంత నియోజకవర్గం కాకపోయినా అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖ నాయక్ ను కాదని పార్టీ అధిష్టానం గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా జాన్సన్ నాయక్ ను బరిలోకి దించింది. గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించి ఓటమి చవిచూశారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. పార్టీ శ్రేణులు చేజారిపోకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో పార్టీ ఉనికిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన జాన్సన్ నాయక్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ముధోల్‌లో నాలుగు స్తంభాలాట..
ముధోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీకి నాయకత్వ సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో బీజేపీలో టికెట్ ఆశించి భంగపడిన రమాదేవి బీఆర్ఎస్లో చేరడం, జిల్లా అధ్యక్ష పదవిపై ఆమె ఆసక్తి చూపడం పార్టీలో కొత్త సమీకరణాలకు తెరలేపింది. మరోవైపు మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, సీనియర్ నేత గాదేవార్ విలాస్, డాక్టర్ కిరణ్ లకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ నలుగురు సమన్వయకర్తలను నియమించింది. దీంతో నియోజకవర్గంలో పార్టీకి ఒకే నాయకత్వం లేకుండా పలువురి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరిని అనుసరించాలో తెలియక క్షేత్రస్థాయి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
నిర్మల్‌లో కొత్త చేరికల చిచ్చు..
నిర్మల్ నియోజకవర్గంలోనూ పార్టీ (Nirmal BRS) పరిస్థితి ఆశాజనకంగా లేదన్న చర్చ సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి చెందాక అధికార హస్తం పార్టీలో చేరిపోవడంతో ఉన్న క్యాడర్ సైతం ఆయన వెంట వెళ్లారు. మున్సిపల్ ఎన్నికల్లోను 42 వార్డుల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. గెలిచిన మైనార్టీ కౌన్సిలర్ సైతం కొద్ది రోజులకే కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి ఎదురుదెబ్బగా మారింది. నియోజకవర్గ ఇన్-చార్జిగా వ్యవహరిస్తున్న కొరిపెల్లి రాంకిషన్ రెడ్డి పనితీరుపై కొందరు పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత మూడేళ్లుగా నాయకులు, కార్యకర్తలను పట్టించుకోలేదని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఇటీవల నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీని క్రియాశీలం చేసే కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు గతంలో పార్టీని వీడిన నాయకులతో పాటు కొత్తవారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యువ వ్యాపారవేత్త నల్ల వినయ్‌రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే ఈ చేరిక పాత నాయకుల్లో కొత్త చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఏళ్లుగా పనిచేస్తున్న తమకు గుర్తింపు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కొత్త నాయకుల రాకతో తమ రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోందన్న ప్రచారం సాగుతోంది.
రైతు గర్జనకు ముందే రచ్చ..
ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లేందుకు నిర్మల్ పట్టణంలో బుధవారం భారీ ఎత్తున రైతు గర్జన నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR)ను ఆహ్వానిస్తూ ఇటీవల పార్టీలో చేరిన యువ నాయకుడు నల్ల వినయ్‌రెడ్డి (Nalla Vinay Reddy) పెద్ద ఎత్తున ప్రచార ఏర్పాట్లు చేపడుతున్నారు. అయితే ఈ ఏర్పాట్లలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదంటూ పాత నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీల్లో తమ ఫొటోలకు చోటు కల్పించడం లేదన్న అభ్యంతరాలు సైతం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన కార్యక్రమం కంటే పార్టీలో ఎవరికి ఎంత ప్రాధాన్యత అనే అంశమే నేతల మధ్య చర్చనీయాంశంగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
క్యాడర్ లేకుండా జనసమీకరణ సాధ్యమేనా..?
ఒకవైపు నాయకుల మధ్య ఆధిపత్య పోరు, మరోవైపు గ్రామస్థాయిలో క్యాడర్ కొరత.. ఇంకోవైపు కొత్త చేరికలతో పాత నాయకుల్లో అసంతృప్తి.. వెరసి నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్(Nirmal BRS)కు రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి. రైతు సమస్యలపై పోరాటం ద్వారా పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని అధిష్టానం భావిస్తున్నప్పటికీ, స్థానిక నేతల మధ్య సమన్వయం కొరవడితే ఆశించిన ఫలితం సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ పాల్గొననున్న రైతు గర్జనకు భారీ జనసమీకరణ చేయడం పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. నాయకులంతా ఒక్కతాటిపైకి వచ్చి పనిచేస్తారా లేక అంతర్గత విభేదాలే కార్యక్రమంపై ప్రభావం చూపుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read : మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎన్నిరోజులకు ఒకసారి రీస్టార్ట్ చేయాలో తెలుసా?
Follow Us On : WhatsApp

