కేసీఆర్ బాటలో కవిత.. సిద్దిపేట అడ్డాగా సంచలన నిర్ణయం!

కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ ర‌క్ష‌ణ సేన(టీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత (Kalvakuntla Kavitha) తన తండ్రి రాజకీయ కంచుకోట నుంచే పార్టీ అజెండాను ఫిక్స్ చేసుకుంది. సిద్దిపేటను అడ్డాగా చేసుకుని కేసీఆర్ రాజకీయంగా రాణించగా.. కవిత కూడా తన రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువుగా మార్చుకుంది. సిద్దిపేట నుంచే రాష్ట్ర‌వ్యాప్తంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాలని ఆమె నిర్ణ‌యించుకుంది. ఉద్య‌మాల పురిటిగ‌డ్డగా పేరొందిన సిద్దిపేటలో కవిత పార్టీ విస్త‌ర‌ణ‌కు కేంద్రంగా చేసుకోవడంలోని వ్యూహం ఏంటి.? రాష్ట్రంలోనే తొలిసారిగా టీఆర్ఎస్ జిల్లా ఆఫీసును సిద్దిపేట‌లోనే నిర్మించడం వెనక ప్లాన్ ఆమె లక్ష్యమేంటనేది ఇప్పటికైతే తెలియదు.

సిద్దిపేటనే కార్య క్షేత్రం

సిద్దిపేట నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్న క‌విత ఇక్కడి ప్ర‌జ‌ల‌కు స్థానికంగా అందుబాటులో ఉండ‌డానికి వీలుగా సొంతంగా ఇల్లు నిర్మించుకోవడంతో పాటు ఉత్త‌ర తెలంగాణ జిల్లాలైన‌ ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెద‌క్ జిల్లాల‌కు కూడా మధ్యలో ఉంటుంది. ఆయా జిల్లాల పార్టీ నేతలకు హైదరాబాద్‌కు రావ‌డం కంటే సిద్దిపేటకే సులువుగా ఉంటుందని, స‌మ‌యం కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర స్థాయి పార్టీ వ్య‌వ‌హ‌రాల‌ను సిద్దిపేట‌లోని ఆఫీసు కేంద్రంగానే నిర్వ‌హిస్తారంటున్నారు. హైద‌రాబాద్​లోని పార్టీ ప్ర‌ధాన కార్యాలయం మాదిరిగానే అన్ని సౌక‌ర్యాల‌తో నిర్మించనున్నారన్నారు. ఇక్కడ ఆఫీసులో మీటింగ్ నిర్వహణకు విశాల‌మైన హాల్స్, వార్ రూం, డైనింగ్ హాల్, పార్టీకి ఇత‌ర ఆసుల‌ను ఒకే చోట నిర్మించాలనే ఆలోచ‌న చేస్తునట్టు తెలుస్తోంది. రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాలతో పాటు 200 మంది వ‌ర‌కు చ‌ర్చించుకోనే విధంగా మీటింగ్ హాల్స్ ను సైతం నిర్వ‌హించుకోవడానికి అనువుగా జిల్లా ఆఫీసు నిర్మాణం చేయనున్నారు.

సెంటిమెంట్​ బాటలోనే..

తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా టీడీపీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్)ని స్థాపించారు. 2001లో సిద్దిపేట నుంచే ఉప ఎన్నికలో గెలిచాడు. ఆ తర్వాత తెలంగాణ‌ ఉద్యమానికి సంబంధించిన పలు కీలక సమావేశాలకు, కార్యక్రమాలకు, ఆందోళనలకు సిద్దిపేటనే వేదికైంది. ఇలా సుదీర్ఘ పోరాటం, తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండుసార్లు కేసీఆర్ సీఎం అయ్యారు. ఇలా తండ్రి బాటలోనే రాజ‌కీయ కేంద్రంగా మార్చుకోవ‌డానికి క‌విత సిద్ధ‌మైనట్టు తెలుస్తోంది. పార్టీ పేరు సైతం టీఆర్ఎస్ అని వ‌చ్చే విధంగా చూసుకోవడంతో పాటు సామాజిక‌ తెలంగాణ సెంటిమెంట్‌తో రాజ‌కీయాలు చేయ‌డం కూడా అజెండాగా పెట్టుకుంది. తండ్రి కేసీఆర్ పోటీ చేసిన సిద్దిపేట నుంచే బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఆయన బాటలోనే కవిత నడుస్తూ రాజ‌కీయాల‌ను చేస్తుండడం అంతటా ఆస‌క్తిగా మారింది.

గులాబీ కంచుకోట‌ నుంచే..

బీఆర్ఎస్ నుంచి స‌స్పెండ్ అయిన క‌విత ఆ త‌ర్వాత సొంత అజెండాతో పార్టీని ప్ర‌క‌టించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ పాంచజన్య బ‌హిరంగ‌ స‌భ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఓ వైపు అధికార కాంగ్రెస్ ను.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పాల‌న వైఫ‌ల్యాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నారు. సొంత కుటుంబ సభ్యులపై విమ‌ర్శ‌లు,ఆరోప‌ణ‌లు చేయ‌డానికి సైతం ఆమె వెనుకాడడంలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్​ రావునే ఎక్కువ‌గా టార్గెట్ చేస్తున్నారు. గతంలో సిద్దిపేట నుంచే పోటీ చేస్తానని ప్ర‌క‌టించి సవాలు విసిరారు.

గ‌తేడాది బ‌తుక‌మ్మ వేడుకలను సొంత‌ గ్రామం చింత‌మ‌డ‌కలో నిర్వహించిన సమయంలో త‌న జ‌న్మ‌భూమి .. క‌ర్మ భూమి ఇక సిద్దిపేట‌నే అని క‌విత స్పష్టత ఇచ్చారు. ఆ త‌ర్వాత ప‌లుమార్లు సిద్దిపేట నుంచే పోటీ చేస్తానని ప్రెస్ మీట్‌లలో చెబుతూ వస్తున్నారు. ఆమె చెప్పిన‌ట్టు గానే సిద్దిపేటలోనే పార్టీ ఆఫీసు నిర్మించి, ఎక్కువ సమయం కేటాయించి అక్కడి ప్రజలకు చేరువ కావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ కేడర్ లో చర్చ జరుగుతోంది.

భవిష్యత్ లో బిగ్ ఫైటేనా..!

గ‌త 40 ఏళ్లుగా సిద్దిపేట‌లో కేసీఆర్ లేదా హ‌రీశ్​​ మాత్ర‌మే పోటీ చేస్తూ వరుస విజయాలు సాధించారు. ప్ర‌త్య‌ర్థులు ఎవరైనా కానీ.. కేసీఆర్ కుటుంబానికి ప్రజలు పట్టం కట్టారు. అనూహ్యంగా కేసీఆర్ కుటుంబంలోని ఇద్ద‌రి మ‌ధ్య పోటీ ఏమౌతుంద‌నేది చర్చ జ‌రుగుతోంది. సిద్దిపేట ఫస్ట్ చాయిస్ అని కవిత ప్ర‌క‌టించ‌డం.. ఇల్లు, ఆఫీసు నిర్మించ‌డానికి సిద్ద‌మవ‌డంతో హరీశ్‌ వర్సెస్ కవితగా భ‌విష్య‌త్ లో బిగ్ ఫైట్‌కు దారితీయ‌నుందా..! అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. రాబోయే సిద్దిపేట మున్సిపల్ ఎన్నిక‌ల్లోనూ క‌విత పోటీచేసి, స‌త్తా చాటాలనే ప్లాన్ లో ఉంది. కేసీఆర్ కూతురు ఒక‌వైపు, మేన‌ల్లుడు మ‌రో వైపు సిద్దిపేట కేంద్రంగా రాజ‌కీయాల్లో భ‌విష్య‌త్​ ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

13న పార్టీ ఆఫీసుకు భూమిపూజ‌

సిద్దిపేటలో టీఆర్ఎస్ తొలి జిల్లా ఆఫీసుకు ఈనెల 13న కవిత భూమిపూజ చేయనుంది. తండ్రి ప్రాతినిథ్యం వ‌హించి, తెలంగాణ రాష్ట్ర స‌మితి పెట్టిన గడ్డ‌మీద‌నే త‌న‌య కూడా పార్టీ తొలి ఆఫీసును నిర్మించనుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సిద్దిపేటనే తొలిది కావ‌డం విశేషం. టౌన్ పరిధిలోని రాజీవ్ ర‌హ‌దారిపైన రంగ‌ధాం ప‌ల్లి చౌర‌స్తాలోని అమ‌ల‌వీరుల స్తూపం వ‌ద్ద‌ క‌విత సొంత భూమిలో ఆఫీసును నిర్మించనుంది. వెయ్యి గ‌జాల స్థలంలో జి ప్ల‌స్ వ‌న్ త‌ర‌హాలో ఏర్పాటు చేయనుంది. ఇది పూర్త‌యిన త‌ర్వాత పార్టీ కార్యక్రమాలను ఇక్కడి నుంచే నిర్వ‌హించ‌డానికి కవిత సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు హైదరాబాద్ కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఇందుకు భిన్నంగా ఆమె హైదరాబాద్​‌తో పాటు సిద్దిపేటను రాజకీయ కేంద్రంగా చేసుకోవాల‌నే నిర్ణయించుకున్నట్టు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>