పవన్ కళ్యాణ్ ​– లెజినోవా విడాకులు.. అసలు కారణం ఏంటి?

కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల (అన్నా లెజ్నెవా) పరస్పర అవగాహనతో విడాకులు (Pawan Kalyan Divorce) తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా వీరి వైవాహిక బంధంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, తామిద్దరం విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన ద్వారా మీడియాకు సోమవారం వెల్లడించారు. తామిద్దరం ఎంతో ఆలోచించి, పరస్పర గౌరవంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు. వైవాహిక బంధం ముగిసినప్పటికీ, భవిష్యత్తులో తాము మంచి స్నేహితులుగా కొనసాగుతామని ప్రకటనలో పేర్కొన్నారు.

అలాగే తమ పిల్లల ఎదుగుదల, వారి బాధ్యతలు, సంతోషాన్ని ఇద్దరం కలిసి పంచుకుంటామని వివరించారు. ఇది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత క్లిష్టమైన సమయమని, కాబట్టి మీడియా, అభిమానులు తమ ప్రైవసీని గౌరవించాలని పవన్, అన్నా లెజ్నెవా కోరారు. గతంలో కూడా వీరిద్దరూ విడిపోతున్నారంటూ పలుమార్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగినప్పటికీ, ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ, కుటుంబ కార్యక్రమాల్లో వీరు జంటగా పాల్గొని ఆ వదంతులకు బ్రేక్ వేశారు. అయితే, ఇప్పుడు ఇరుపక్షాల అంగీకారంతోనే అధికారికంగా విడిపోతున్నట్లు స్పష్టం చేయడంతో ఈ వార్త రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్​​గా మారింది.

మూడు పెళ్లిళ్లు.. విడాకులు

పవన్ కల్యాణ్​కు 1997 మే నెలలో నందిని అనే మహిళతో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ వివాహం జరిగిన కొద్ది రోజులకే విడిపోయారు. అనంతరం చట్టబద్ధంగా కోర్టు ద్వారా 2008లో విడాకులు తీసుకున్నారు. ప్రముఖ నటి, మోడల్ రేణూ దేశాయ్​తో పవన్ కల్యాణ్ వివాహం 2009లో జరిగింది. వీరిద్దరూ ‘బద్రి’, ‘జానీ’ వంటి చిత్రాలలో కలిసి నటించారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వీరు 2012లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2013లో ఆయన అన్నా లెజ్నెవా (అన్నా కొణిదెల)ను మూడో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెతో కూడా పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు తాజాగా సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

అసలు విడాకులకు కారణం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ డివోర్స్ (Pawan Kalyan Divorce) తీసుకున్నట్లు ప్రకటన రావడంపై ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్, లెజినోవా విడిపోవడానికి గల కారణాన్ని వీరిద్దరు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో మాత్రం వెల్లడించలేదు. వ్యక్తిగత విభేదాలు, ఇతర కారణాలపై ఎలాంటి వివరాలు పేర్కొనలేదు. విడాకులకు అసలు కారణం ఏమిటన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. డివోర్స్ పై కొణిదెల కుటుంబంతో పాటు కూటమి నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>