ఇరాన్​ బిగ్​ ప్లాన్​.. చైనాలో రహస్య చమురు నెట్‌వర్క్

కలం, వెబ్​ డెస్క్​: అమెరికా ఆంక్షలను అధిగమించి తమ ముడి చమురును రవాణా చేసేందుకు, విక్రయించేందుకు ఇరాన్ (Iran Oil Exports) చైనాలోని పలు కీలక ప్రాంతాల్లో ఆయిల్ టెర్మినల్స్, స్టోరేజ్ కేంద్రాలపై నియంత్రణ సాధించింది. ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ సంస్థకు లభించిన ఒక రహస్య లేఖ, ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ద్వారా ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైనాలోని పోర్టు వసతులు, దీర్ఘకాలిక లీజులు, చమురు నిల్వ ట్యాంకులను ఇరాన్ తన ఆధీనంలో ఉంచుకున్నది. దీంతో అమెరికా ఆంక్షలున్న నౌకలు మధ్యలో మరో నౌకలోకి చమురును మార్చాల్సిన అవసరం లేకుండా.. నేరుగా చైనా పోర్టుల్లోనే అన్‌లోడ్ చేసే వెసులుబాటు కలిగింది.

లీకైన లేఖలో ఏముంది?

నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ (ఎన్​ఐవోసీ) మాజీ అధిపతి, ప్రస్తుత తాత్కాలిక చమురు శాఖ మంత్రి హమీద్ బోవర్డ్ రాసిన రహస్య లేఖలో ఈ వివరాలను ప్రస్తావించారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మాజీ కార్యదర్శి, నాటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ రాజకీయ సలహాదారు అలీ షంఖానీ రాసిన లేఖకు సమాధానంగా బోవర్డ్ ఈ వివరాలు వెల్లడించారు. మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హయాంలోని చమురు వాణిజ్య విధానాలను బోవర్డ్ తన లేఖలో విమర్శించారు.

ప్రస్తుత అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ నేతృత్వంలో చైనా రహస్య సహకారంతో కొత్త ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్ విదేశాంగ శాఖ చర్చలు జరిపి చైనా పోర్టుల్లోని టెర్మినల్స్‌కు అనుమతులు సాధించగా, చమురు మార్కెట్​లో నేరుగా విక్రయించేందుకు వీలుగా నిల్వ కేంద్రాలను దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నారు.

చైనాలో ఇరాన్ ఆధీనంలోని కేంద్రాలు

ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం.. చైనాలోని మూడు ప్రాంతాల్లో టెహ్రాన్ కీలక వసతులను తన నియంత్రణలోకి తెచ్చుకున్నది. వీటిలో నింగ్బో-ఝౌషాన్ ఫ్రీ ట్రేడ్ జోన్‌లోని ఒక టెర్మినల్‌తో పాటు షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కింగ్‌డావో, ప్యాంట్ వద్ద ఉన్న చిన్న డాక్‌లలో వాటాలు ఉన్నాయి. ఈ డాక్‌లు పైప్‌లైన్లకు సమీపంలో ఉండటంతో చమురును నేరుగా చైనా రిఫైనరీలకు తరలించడం సులభమైంది. వీటితో పాటు చైనాలో 7 ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులను ఇరాన్ కొనుగోలు చేసింది. ఇందులో 4 డాలియన్, హుయిజౌ పోర్టులతో పాటు డాంగింగ్, వీఫాంగ్ తీర నగరాల్లో ఉన్నాయి.

మరో మూడు నింగ్బో-ఝౌషాన్ ద్వీపసమూహంలోని అయోషాన్, షులాంగ్హు దీవులు, జెంగ్యామువో ఆయిల్ జోన్‌లో ఉన్నాయి. అలీ షంఖానీ కొడుకు హుస్సేన్ షంఖానీ నడుపుతున్న ‘షాడో ఫ్లీట్’ (రహస్య నౌకాదళం) ట్యాంకర్లు ఈ కేంద్రాలను ఉపయోగిస్తున్నాయి. హుస్సేన్ షంఖానీకి చెందిన 51 నౌకలపై అమెరికా ట్రెజరీ విభాగం గతంలోనే ఆంక్షలు విధించింది.

2025లో 80 శాతం చమురు చైనాకే..

అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్ చమురు ఎగుమతులు (Iran Oil Exports) కొనసాగడంలో చైనా కీలక పాత్ర పోషిస్తున్నది. 2025లో ఇరాన్ సముద్ర మార్గం ద్వారా ఎగుమతి చేసిన చమురులో 80 శాతానికి పైగా (రోజుకు సుమారు 1.4 మిలియన్ బ్యారెళ్లు) చైనానే కొనుగోలు చేసినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొన్నది. అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలకు చిక్కకుండా ఉండేందుకు ఇరు దేశాలు ఒక ప్రత్యేక చెల్లింపుల వ్యవస్థను (ఎప్​పీవీ) రూపొందించుకున్నాయి. ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా వచ్చే సొమ్మును క్రెడిట్లుగా మార్చి, వాటితో మందులు, వాహనాలు, కమ్యూనికేషన్ పరికరాల వంటి చైనా వస్తువులను ఇరాన్​ కొనుగోలు చేస్తున్నది. చైనా కంపెనీలకు నేరుగా ఇరాన్‌తో సంబంధం లేకుండానే చెల్లింపులు జరుగుతున్నాయి.

భారీ డిస్కౌంట్లపై ఇరాన్‌లో అంతర్గత విభేదాలు

ఇటీవల చైనా వైఖరిలో మార్పు వస్తున్నట్లు బోవర్డ్ లేఖ స్పష్టం చేస్తున్నది. తమ రిఫైనరీలకు చమురు దిగుమతి కోటాను పెంచాలన్న ఇరాన్ అభ్యర్థనను బీజింగ్ తిరస్కరించింది. పైగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లను పెంచిన చైనా.. ఇరాన్ చమురుపై భారీ డిస్కౌంట్లు డిమాండ్ చేస్తున్నది. మరోవైపు, ఇరాన్ చమురు వ్యాపారంలో హుస్సేన్ షంఖానీ పాత్రపై కూడా అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి.

ప్రభుత్వ రుణాలతో కొనుగోలు చేసిన నౌకలను హుస్సేన్ ఇరాన్ చమురుకు బదులుగా రష్యా చమురు రవాణాకు వాడుతున్నారని, ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇరాన్ చమురును తీసుకొని అమ్ముకుంటున్నారని బోవర్డ్ ఆరోపించారు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కేంద్రంగా ఆయన ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారని, చమురు మంత్రిత్వ శాఖ ఆయన వ్యాపార ప్రయోజనాలకు ఏజెంట్‌గా మారిపోయిందని విమర్శలు చేశారు. రైసీ హయాంలో బ్యారెల్‌పై 50 సెంట్లుగా ఉన్న డిస్కౌంట్.. పెజెష్కియన్ హయాంలో 9 డాలర్లకు పెరిగిందని అలీ షంఖానీ గతంలో ఖమేనీకి ఫిర్యాదు చేయగా.. బోవర్డ్ ఆ వాదనను తోసిపుచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>