కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. ఈసీ సంచలన నివేదిక!

కలం, నేషనల్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీకి రూ.20వేల కంటే ఎక్కువ మొత్తంలో అందే విరాళాలు (Congress Donations) 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారీగా పడిపోయాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 75 శాతం తగ్గుదలతో కేవలం రూ.130.69 కోట్లకు పరిమితమయ్యాయి. దశాబ్ద కాలంలో ఆ పార్టీ విరాళాల్లో ఇదే అతిపెద్ద వార్షిక తగ్గుదల అని కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) సమర్పించిన నివేదికల విశ్లేషణలో వెల్లడైంది. లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 వేలకు పైబడిన విరాళాల రూపంలో కాంగ్రెస్ పార్టీకి రూ.517.39 కోట్లు అందాయి. 2023-24లో రూ.281.48 కోట్లు వచ్చాయి. గత 12 ఆర్థిక సంవత్సరాలతో పోల్చి చూస్తే.. అంతకుముందు 2015-16లో అత్యంత భారీ తగ్గుదల నమోదైంది. ఆ ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్‌కు అందిన విరాళాలు.. అంతకుముందు ఏడాదిలో అందిన రూ.141.46 కోట్లతో పోలిస్తే సుమారు 86 శాతం తగ్గిపోయాయి.

ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ విరాళాలు డౌన్

‘ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్’ నుంచి వచ్చే నిధులు భారీగా పడిపోవడమే విరాళాలు తగ్గడానికి ప్రధాన కారణం. 2024-25లో ఈ ట్రస్ట్ కాంగ్రెస్‌కు రూ.216.34 కోట్లు ఇవ్వగా, 2025-26లో అది రూ.25 కోట్లకు పడిపోయింది (దాదాపు 88 శాతం తగ్గుదల). పార్టీ తాజా నివేదికలో పేరున్న ఏకైక ఎలక్టోరల్ ట్రస్ట్ ఇదే కావడం గమనార్హం. ఇతర ప్రధాన దాతలలో స్టార్ సిమెంట్ రూ.5 కోట్లు, సజ్జన్ భజంకా రూ.4 కోట్లు, ప్రేమ్ కుమార్ భజంకా రూ.2 కోట్ల చొప్పున కాంగ్రెస్​‌కు విరాళాలు ఇచ్చారు.

బీజేపీతో పోలిస్తే తక్కువే..

వార్షిక ప్రాతిపదికన భారీ తగ్గుదల కనిపించినప్పటికీ.. అంతకుముందు కొన్ని సంవత్సరాలతో పోలిస్తే 2025-26లో వచ్చిన విరాళాలు ఎక్కువగానే ఉన్నాయి. కాంగ్రెస్‌కు 2020-21లో రూ.74.52 కోట్లు, 2021-22లో రూ.95.46 కోట్లు, 2022-23లో రూ.79.92 కోట్లు అందాయి. మరోవైపు, 2024-25లో బీజేపీకి రూ.20వేల కంటే ఎక్కువ విరాళాల రూపంలో ఏకంగా రూ.6,074.02 కోట్లు అందాయి. ఇది అదే కాలంలో కాంగ్రెస్ సేకరించిన మొత్తానికి దాదాపు 12 రెట్లు ఎక్కువ. బీజేపీకి సంబంధించిన 2025-26 విరాళాల నివేదికను ఎన్నికల సంఘం ఇంకా బహిర్గతం చేయలేదు. గత 12 ఆర్థిక సంవత్సరాల్లో ఏటా కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ విరాళాలు వచ్చాయి.

మొత్తం ఆదాయంపై రాని స్పష్టత

ఈ గణాంకాలలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన నిధులు కలపలేదు. ఎలక్టోరల్ బాండ్లు అమల్లో ఉన్నప్పుడు వాటి వివరాలను విడిగా సమర్పించేవారు. గత కొన్ని సంవత్సరాల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని కలిపి చూస్తే.. 2025-26లో కాంగ్రెస్ సేకరించిన విరాళాలు 2020-21 తర్వాత అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. అయితే, ఈ విరాళాల నివేదిక పార్టీ మొత్తం ఆదాయాన్ని ప్రతిబింబించదు. రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు, సభ్యత్వ రుసుములు, కూపన్ల సేకరణ, వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం ఇందులో ఉండదు. 2024-25లో ఒక్క కూపన్ల సేకరణ ద్వారానే కాంగ్రెస్‌కు రూ.350.12 కోట్లు వచ్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ చేసిన ఖాతాలను పార్టీ ఇంకా సమర్పించలేదు. అవి అప్‌లోడ్ అయితేనే పార్టీ పూర్తి ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వస్తుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>