అభివృద్ధిని అడ్డుకుంటే దేనికైనా సిద్ధం.. రవీందర్ సింగ్ సవాల్

కలం, కరీంనగర్: కరీంనగర్ డంప్ యార్డ్ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న ప్రకటనలపై కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ (Ravinder Singh) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక బీఆర్ఎస్ నగర కార్పొరేటర్లతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ ముఖచిత్రాన్ని మార్చి, నగర అభివృద్ధి ప్రదాతగా నిలిచింది గంగుల కమలాకర్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో, గంగుల కమలాకర్ హయాంలో కరీంనగర్‌కు వందల కోట్ల నిధులు తెచ్చి అద్భుతమైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్‌దేనని గుర్తుచేశారు. అభివృద్ధి పనులను అడ్డుకోవాల్సిన ఖర్మ, అవసరం తమకు లేదని తేల్చిచెప్పారు.

కేంద్రంలో మీరే.. రాష్ట్రంలో మీరే..

కాంట్రాక్టర్లను భయపెడుతున్నారని, పనులను అడ్డుకుంటున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని రవీందర్ సింగ్ మండిపడ్డారు. నగరంలో మున్సిపల్ అధికారాల్లో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉందని గుర్తుచేశారు.

“మీ చేతుల్లోనే పోలీస్ శాఖ ఉంది, సీఐడీ ఉంది, సీబీఐ ఉంది, సమస్త వ్యవస్థలు మీ కాళ్ల దగ్గర ఉన్నాయి. మరి ఇంకెవరిని చూసి భయపడుతున్నారు? కాంట్రాక్టర్లను ఎవరు భయపెట్టారో, అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారో దమ్ము, ధైర్యం ఉంటే తక్షణమే కేసులు పెట్టండి.. అరెస్టులు చేసి జైల్లో పెట్టండి! క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్‌పై బురదజల్లుతూ చిల్లర రాజకీయాలు చేస్తారా?” అని నిలదీశారు.

బండి సంజయ్ స్వయంగా కేంద్ర హోంశాఖలో ఉన్నారని, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి కూర్చొని, ఎవరు పనులు అడ్డుకుంటున్నారో వారిపై తక్షణమే కేసులు పెట్టి సమగ్ర విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా చిల్లర ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

కరీంనగర్ ప్రజలను మోసం చేయలేరు..

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తామని మాటలు చెప్పే మంత్రులు, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని రవీందర్ సింగ్ విమర్శించారు. కరీంనగర్ ప్రజలకు అన్నీ తెలుసని, ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు రాజకీయ లబ్ధి కోసం నాటకాలు ఆడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా నిందారోపణలు ఆపి, డంప్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

“కరీంనగర్ ప్రజలు అమాయకులు కారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరీంనగర్ ఎంతటి స్వర్ణయుగాన్ని చూసిందో ప్రతి గల్లీలో ఉన్న చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అభివృద్ధిని అడ్డుకునే అలవాటు బీజేపీ, కాంగ్రెస్ రక్తంలోనే ఉంది. ఇప్పటికైనా నిందారోపణలు మాని డంప్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. లేనిపక్షంలో నగర ప్రజలతో కలిసి బీజేపీ, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని నడిబజారులో ఎండగడతాం, ప్రజాగ్రహం ముందు మీరు కొట్టుకుపోవడం ఖాయం” అని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>