కలం, యాదగిరిగుట్ట : ‘రెడ్లారా హెచ్చరిస్తున్నాం.. మీ దొరల రాజ్యాన్ని కూల్చేస్తాం! మమ్మల్ని దోచుకున్న ప్రతి రూపాయికి లెక్క తేలుస్తాం’ అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో హెచ్చరించారు. బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా 47వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన, స్థానిక గుట్ట సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం సాక్షిగా పాలక వర్గాలైన రెడ్లు, వెలమలపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ సమాజంలో 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అధికారంలోకి వచ్చినప్పుడే పేదల బతుకులు మారుతాయని, ఆ దిశగానే తమ పార్టీ పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేస్తున్నది రెడ్లేనని, కాంగ్రెస్ రెడ్ల పార్టీ అయితే బీఆర్ఎస్ వెలమల పార్టీ అని మల్లన్న విమర్శించారు. కాంగ్రెస్ నుంచి బీసీ నాయకుడు గెలిస్తే గాంధీ భవన్లో జీతగాడిగా మారతాడని, బీఆర్ఎస్ నుంచి గెలిస్తే కేసీఆర్ గడీలకు కాపలాదారుడవుతాడని, తప్ప బీసీల కోసం మాట్లాడే ధైర్యం వారికి లేదన్నారు.
హిమాచల్ ప్రదేశ్లో ఒక రెడ్డి దొంగ ఎస్సీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందితే సుప్రీంకోర్టు బోనులో నిలబెట్టిందని గుర్తుచేస్తూ, ఉద్యోగాలు కొల్లగొట్టేందుకు రెడ్లు దొంగ సర్టిఫికెట్లతో ఎస్సీ, ఎస్టీలమని నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్, అసెంబ్లీలో దొంగ బిల్లు ప్రవేశపెట్టి, వెనుక ఉండి కోర్టుల ద్వారా స్టే తెప్పించి బీసీలను దగా చేసిందని మండిపడ్డారు. శాసనసభలో తమ ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన అధికారిక లెక్కలను బయటపెడుతూ, బీసీలకు కేటాయించిన రూ.60 వేల కోట్ల నిధులతో పాటు స్కాలర్షిప్లు, హాస్టల్ విద్యార్థుల భోజనాలు, గీత, చేనేత కార్మికుల సంక్షేమ నిధులను దారి మళ్లించి రెడ్లు, కాంట్రాక్టర్లు పంచుకున్నారని ఆధారాలతో సహా నిలదీశారు.
1949 నాటి నిజాం ఫర్మానా నంబర్ 1358 ఆధారంగా రెడ్లు, వెలమల ఆధీనంలో ఉన్న కోటి ఎకరాల సీలింగ్ భూములను స్వాధీనం చేసుకుని, రాబోయే బీసీ ప్రభుత్వంలో పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు. ఆలేరు నియోజకవర్గానికి మోత్కుపల్లి నరసింహులు తండ్రిలా సేవలు అందించారని, 2028లో ఆలేరుపై బీసీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి పాలకూరి అశోక్ సార్ను గెలిపించి కాంగ్రెస్కు డిపాజిట్ దక్కకుండా చేయాలని పిలుపునిచ్చారు. తమ గుర్తు ‘కత్తెర’తో దొరల తోకలు కత్తిరిస్తామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పిట్టల శంకర్, కొమిరిశెట్టి నరసింహులు, బంధారపు నర్సయ్య గౌడ్, పటేల్ వనజక్క తదితరులు పాల్గొన్నారు.

