కలం, జగిత్యాల: బీర్పూర్ (Beerpur) మండలం కోమన్ పల్లి గ్రామ పరిధిలోని (Komanpalle) పెద్దగట్టు, చిన్నగుట్టల భూముల విషయంలో వివాదం నెలకొంది. ఈ భూములకు సంబంధించి తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌కు అందజేసిన వినతిపత్రంలో గ్రామస్థులు పలు అంశాలను ప్రస్తావిస్తూ కోమన్ పల్లి గ్రామంలో పెద్దగట్టు, చిన్నగుట్టల పరిధిలో సుమారు 50 ఎకరాల భూమి ఉందని, గతంలో ఈ భూములపై గ్రామస్థులకు హక్కులు, సంబంధాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం కొంతమంది వ్యక్తులు ఈ భూములను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కట్టలు వేసి సాగు చేసుకోవడంతో పాటు భూముల స్వరూపాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులో గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ, భూములపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు.
గ్రామ ప్రజలకు సంబంధించిన భూముల విషయంలో ఎలాంటి అన్యాయం జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, భూముల హక్కులు, రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలికితీయాలని కలెక్టర్‌ను గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ స్పందించి సంబంధిత రెవెన్యూ అధికారులతో విచారణ జరిపించి, తమకు న్యాయం చేయాలని కోమన్ పల్లి గ్రామస్థులు కోరుతున్నారు.

