కలం, స్పోర్ట్స్: సూపర్ స్టార్ ఆటగాళ్లను ప్రశ్నించాలంటే కోచ్‌లు కూడా ఆలోచిస్తున్నారా? విరాట్ కోహ్లీ (Virat Kohli) విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషాట్ బయటపెట్టారు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ బ్యాటింగ్‌లో కనిపించిన లోపాన్ని గుర్తించినా.. ఆయనతో మాట్లాడేందుకు తాను కూడా ధైర్యం కూడగట్టుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఆఫ్ స్టంప్ అవతల బంతులను డ్రైవ్ చేయడానికి ప్రయత్నించి పదేపదే వికెట్ కోల్పోయాడు. ఒకే తరహాలో ఔట్ అవుతుండటంతో అతడి బ్యాటింగ్ టెక్నిక్‌పై చర్చ మొదలైంది. ఈ క్రమంలో నాలుగో టెస్టు సమయంలో కోహ్లీతో మాట్లాడాలని టెన్ డోషాట్ నిర్ణయించుకున్నారు.
అయితే, స్టార్ ఆటగాళ్లకు సలహాలు ఇచ్చే విషయంలో కోచ్‌లు జాగ్రత్తగా ఉంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తమ జోక్యం ఆటగాడికి ఉపయోగపడుతుందా? లేక అతడి ఆలోచనలను గందరగోళానికి గురిచేస్తుందా? అనే సందేహం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఆటగాళ్ల ప్రాధాన్యం పెరిగిన ప్రస్తుత క్రికెట్లో కోచ్‌లు తమ అభిప్రాయాలను చెప్పేందుకు వెనుకాడుతున్నారని వివరించారు. కోహ్లీతో మాట్లాడేందుకు సరైన సమయం కోసం ఎదురుచూసిన టెన్ డోషాట్.. వర్షం కారణంగా ఆట నిలిచిన సమయంలో అతడిని సంప్రదించారు.
నేరుగా తప్పు ఎత్తిచూపకుండా, తన అభిప్రాయాన్ని సున్నితంగా వివరించారు. కోహ్లీ (Virat Kohli) కూడా ఈ చర్చకు సానుకూలంగా స్పందించారని టెన్ డోషాట్ తెలిపారు. తాను ఆ తరహా షాట్లు ఎందుకు ఆడుతున్నాడో కోహ్లీ వివరించారని చెప్పారు. ఆటగాడి ఆలోచనలను అర్థం చేసుకున్న తర్వాతే అవసరమైన మార్పుల గురించి చర్చించవచ్చని పేర్కొన్నారు. అయితే, ఈ చర్చ తర్వాత కూడా సిరీస్ చివరి దశలో ఆశించిన ఫలితాలు రాలేదని టెన్ డోషాట్ అంగీకరించారు. ఆటగాడికి సలహా ఇచ్చే సమయంలో విషయం చెప్పే విధానం, సరైన సమయం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read : “వేట్టువం” నుంచి స్పెషల్ వీడియో రిలీజ్
Follow Us On: X(Twitter)

