కలం, సూర్యాపేట: ఆడపిల్లల విద్య, సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థినులకు కనీసం గుక్కెడు తాగునీరు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. సూర్యాపేట జిల్లా మద్దిరాల (Maddirala) మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(KGBV)లో తీవ్ర తాగునీటి ఎద్దడి తలెత్తింది. సమస్యను పరిష్కరించాల్సిన పాఠశాల సిబ్బంది ఏకంగా విద్యార్థినులకు సెలవులు ప్రకటించి ఇంటికి పంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
పాఠశాలలో గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సింది పోయి, సిబ్బంది సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు. దీపావళి పండుగ పేరు చెప్పి వరుసగా నాలుగు రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించి బాలికలను ఇళ్లకు పంపించేశారు. గురుకులాలు, కేజీబీవీల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని అధికారులు చెబుతున్న మాటలకు మద్దిరాల (Maddirala) ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
మరోవైపు కేజీబీవీలోనే ఉండిపోయిన కొంతమంది విద్యార్థినులకు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశారు. ట్యాంకర్ నుంచి విద్యార్థినులే నీటిని మోసుకెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో తక్షణమే తాగునీటి సౌకర్యాన్ని పునరుద్ధరించాలని, నీటి ఎద్దడి సాకుతో విద్యాబోధనకు విఘాతం కలిగిస్తూ విద్యార్థినులను ఇళ్లకు పంపిన బాధ్యులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : ఉద్యోగుల సస్పెన్షన్పై సుప్రీం కోర్టు కీలక తీర్పు
Follow Us On: Youtube

