కలం, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్నికల ఫలితాలపై సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి 58.90 ఓటింగ్ శాతం వచ్చినట్లు తెలిపారు. ఇక వైసీపీకి 33.56 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. కూటమికి 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ప్రజాదరణ పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో కూటమి మెజారిటీ దాదాపు 25.34 శాతం వరకు ఉందని చెప్పారు. పట్టణాల్లో 59.9 శాతం కూటమికి వచ్చాయన్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారని విమర్శించారు.
స్థానిక ఎన్నికల్లో వైసీపీ తీరుపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర విమర్శలు చేశారు. ఈవీఎం లను తాము మేనేజ్ చేశామని వైసీపీ నాయకులు అన్నారని.. బ్యాలెట్ పెరిగితే రిగ్గింగ్ చేశామని అంటున్నారని మండిపడ్డారు. తమ విజయం బ్యాలెట్ తెచ్చిన విజయమని.. ఇప్పటికైనా తమపై ఆరోపణలు మానేయాలని అన్నారు. ప్రజలు కూటమికి అండగా ఉంటామని తీర్పునిచ్చారని అన్నారు. తమ కూటమిని ఆశీర్వదించిన ప్రజలందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ హాయాంలోని ఐదేళ్ల పాటు రాష్ట్రంలో బీభత్సం జరిగిందని దుయ్యబట్టారు. జరిగిన విధ్వంసాన్ని చెప్పడమే కాకుండా.. శ్వేతపత్రాల ద్వారా వివరించినట్లు తెలిపారు. మంచి రాజకీయాలకు, సుపరిపాలనకు నాంది అనే నమ్మకం మరోసారి రుజువైందన్నారు.
Also Read : ఉద్యోగుల సస్పెన్షన్పై సుప్రీం కోర్టు కీలక తీర్పు
Follow Us On : WhatsApp

