కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) నుంచి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి (CPS to OPS) మారేందుకు అర్హులైన ఉద్యోగులకు ఒకేసారి అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు అర్హతలు, దరఖాస్తు విధానం, సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు పేర్కొంది.
అర్హలు ఎవరంటే?
2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందే నియామక నోటిఫికేషన్ విడుదలై ఉండాలి. ఆ నోటిఫికేషన్ ఆధారంగా 2004 సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారు మాత్రమే అర్హులు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల కుటుంబ పెన్షన్ లబ్ధిదారులు కూడా ఈ వెసులుబాటుకు అర్హులే.
దరఖాస్తు విధానం ఇలా..
అర్హులైన ఉద్యోగులు NIDHI పోర్టల్లోని CPS-OPS Conversion ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం నియామక నోటిఫికేషన్ కాపీ, సెలక్షన్ లిస్ట్, అపాయింట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ ఆర్డర్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వీటిని అధికారులు పరిశీలించిన తరువాతే సీపీఎస్ నుంచి ఓపీఎస్ కు మార్పుపై తుది నిర్ణయం తీసుకుంటారు. డిసెంబర్ 31 వరకు మాత్రమే దరఖాస్తు చేసేందుకు ప్రభుత్వం గడువు విధించింది.

