కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే తపనతో అహర్నిశలు కష్టపడుతుంటే.. కొంత మంది తమ కాళ్లలో కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Minister Bandi Sanjay Kumar) మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా కేంద్రం అనేక పనులకు నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో ఆ నిధులన్నీ మురిగిపోయి అభివృద్ధి ఆగిపోయిందన్నారు.
చిల్లర వేషగాళ్ల ట్రాప్లో పడొద్దు..
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలంలో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించలేకపోయిందని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమృత్ స్కీం కింద రూ.17 కోట్లు, యూసీఎఫ్ స్కీంలో భాగంగా రూ.80 కోట్ల నిధులతో పనులు మొదలు పెడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా రూ.17 కోట్లతో టెండర్ పనులను ప్రారంభిస్తే.. లేనిపోని వివాదాలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ ప్రజలతోపాటు అభివృద్ధిని కాంక్షించే వాళ్లంతా వాస్తవాలు గ్రహించాలని, చిల్లర వేషగాళ్ల ట్రాప్లో పడొద్దని కోరారు.
సోమవారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, స్థానిక నేతలతో కలిసి కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రాంనగర్ డివిజన్ లో రూ.1.5 కోట్ల వ్యయంతో రూపొందించిన బాక్స్ టైప్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. “అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కళ్లు. గతంలో జరిగిన పరిస్థితికి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి ఉన్న తేడాను గమనించండి. కేంద్రం నుండి నిధులు తేవడంతోపాటు మ్యాచింగ్ గ్రాంట్ మంజూరుతో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివ్రుద్ధి విషయంలో సహకరిస్తోంది.
డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం అమృత్ స్కీం కింద రూ.17 కోట్లతో పనులకు టెండర్ పనులు స్టార్ట్ అయ్యాయి. యూసీఎఫ్ కింద మరో రూ.80 కోట్లతో ఈ సమస్యను పరిష్కరించబోతున్నాం. ఈ పనులకు సంబంధించి టెండర్ ప్రాసెస్ మొదలైన క్రమంలో ఈ అంశాన్ని వివాదాస్పదం చేసి ఆ పనులను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పదేపదే కుట్రలు చేస్తున్నాయి. పని చేసే వాళ్ల కాళ్లల్లో కట్టెలు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాయి. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు పని చేయరు. ఇప్పుడు మేం చేస్తుంటే అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయి. అట్లాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండి బుద్ది చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. టెండర్ పనుల విషయంలో నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలి” అని అన్నారు.
గతంలో కరీంనగర్ మేయర్గా డి. శంకర్ ఉన్న సమయంలో ప్రతి చోట డెంగ్యు ఉందంటూ లేనిపోని వివాదాలు సృష్టించి, దుష్ప్రచారం చేసి కరీంనగర్ పేరును చెడగొట్టేందుకు యత్నించారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి చిల్లరగాళ్ల ట్రాపులో పడొద్దని, మేం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నామని హామీ ఇచ్చారు.

